భళా.. పెన్సిల్‌ కొనపై శివలింగం!

పెన్సిల్‌ కొనపై శివలింగాన్ని అద్భుతంగా మలిచి తనదైన ప్రతిభతో అందరితో భళా అనిపించుకున్నాడో కళాకారుడు. మహాశివరాత్రి సందర్భంగా పెన్సిల్‌ కొనపై శివలింగాన్ని చిత్రీకరించడంతో పాటు ఓ........

Published : 21 Feb 2020 14:59 IST

భువనేశ్వర్‌: పెన్సిల్‌ కొనపై శివలింగాన్ని అద్భుతంగా మలిచి తనదైన ప్రతిభతో అందరితోనూ భళా అనిపించుకున్నాడో కళాకారుడు. మహాశివరాత్రి సందర్భంగా పెన్సిల్‌ కొనపై శివలింగాన్ని చెక్కడంతో పాటు ఓ చిన్న రాయిని శివలింగంగా మలచి దాన్నో సీసాలో అమర్చి అబ్బురపరిచాడు. మూడు రోజుల పాటు శ్రమించి వీటిని తయారు చేయడం ద్వారా ఆ పరమశివుడి పట్ల తనకున్న భక్తిని చాటుకున్నాడు ఒడిశాకు చెందిన ప్రముఖ కళాకారుడు ఎల్‌.ఈశ్వరరావు. 

భువనేశ్వర్‌కు సమీపంలోని ఖుర్దా జిల్లాకు జట్నికి చెందిన ఈశ్వరరావు గతంలోనూ అనేక కళాకృతులను చెక్కి వార్తల్లో నిలిచాడు. తాజాగా, మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా 0.5 అంగుళాల పరిమాణం ఉన్న రాయిని శివలింగంగా రూపొందించి దాన్ని ఓ సీసాలో అమర్చాడు. అలాగే, 0.5సెం.మీల పెన్సిల్‌ కొనపైనా శివలింగాన్ని రూపొందించాడు. ఈ కళాకృతులను మూడు రోజుల సమయం పట్టిందని వివరించాడు. నాలుగు చిన్న చిన్న ముక్కలను సీసాలో మర్చడం చాలా కష్టమైందని మీడియాకు తెలిపాడు. 

తన కళాత్మకతతో అందరినీ ఆశ్చర్యపరచడం ఈశ్వరరావుకు ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా పురుషుల హాకీ ప్రపంచ కప్‌ ట్రోఫీని పెన్సిల్, చింతపిక్కలతో రూపొందించి అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. అలాగే, గతేడాది క్రిస్మస్‌ సందర్భంగా  ఓ సీసాలో చర్చిని రూపొందించాడు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా సబ్బుతో సర్థార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని మలిచి సీసాలో ఉంచడం ద్వారా ఔరా అనిపించుకున్నాడు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ సాధించిన ఘన విజయానికి ప్రతీకగా పెన్సిల్‌ కొనపై వీరిద్దరి చిత్రాలను వేర్వేరుగా రూపొందించి భళా అనిపించుకొని వార్తల్లో నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని