బదిలీల్లో అవకతవకలు జరగలేదు: సీపీ

పోలీసుల బదిలీల్లో ఎలాంటి అవకతవకలూ జరగలేదని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు స్పష్టంచేశారు. అక్రమాలపై ఆధారాలు ఉంటే చూపించాలన్న సీపీలు అంజనీకుమార్‌, సజ్జనార్‌, మహేశ్‌ భగవత్‌...

Updated : 22 Feb 2020 22:36 IST

హైదరాబాద్‌: పోలీసుల బదిలీల్లో ఎలాంటి అవకతవకలూ జరగలేదని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు స్పష్టంచేశారు. అక్రమాలపై ఆధారాలు ఉంటే చూపించాలన్న సీపీలు అంజనీకుమార్‌, సజ్జనార్‌, మహేశ్‌ భగవత్‌ న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దేశవ్యాప్తంగా పోలీస్‌ శాఖకు మంచిపేరు ఉందని తెలిపారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు లేవనీ.. నేర పరిశోధనలో ఇతర రాష్ట్రాలకు సహాయం చేస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల విధుల్లో ప్రభుత్వం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. పోలీస్‌ శాఖలో ఒకరిద్దరు తప్పుచేస్తే అందరికీ అపాదించడం సరికాదని అంజనీ కుమార్‌ స్పష్టంచేశారు. తప్పుడు కథనాలపై చర్యలు తీసుకుంటామని సీపీలు అంజనీకుమార్‌, మహేశ్‌ భగవత్‌ తెలిపారు.  

ఇలాంటి పరిస్థితుల్ని 30ఏళ్లలో చూడలేదు

రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను తన 30 ఏళ్ల సర్వీసులో ఎప్పుడూ చూడలేదని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీసు శాఖకు మంచి పేరు ఉందన్నారు. నేర పరిశోధనలో ఇతర రాష్ట్రాలకు సైతం సహాయం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వార్తలు వచ్చాయని.. అలాంటి అక్రమాలపై ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. సమాజంలో మీడియా పోషించాల్సిన బాధ్యత చాలా గొప్పదన్నారు. ప్రజలు మీడియాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి అంశాన్ని మీడియాకు వివరిస్తున్నామని.. ప్రజల్లో సరైన అవగాహన పెంచాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుందన్నారు. 

సభలకు అనుమతి విషయంలో పారదర్శకత పాటిస్తున్నామని.. దానికంటూ ఒక ప్రక్రియ ఉంటుందని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. ట్రాఫిక్‌, ఇంటెలిజెన్స్‌, ఇతరత్రా విభాగాలతో చర్చించిన తర్వాతే సభలకు అనుమతి ఇస్తామని వివరించారు. ఎన్నికల విధుల్లో ప్రభుత్వం ఎప్పుడూ కల్పించుకోలేదని.. తెలంగాణ ఎన్నికల విధుల్లో రాజకీయ జోక్యం జరగలేదని కేంద్ర సంస్థలు ప్రశంసించినట్లు సీపీ వివరించారు. ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అవార్డు కూడా వచ్చినట్లు గుర్తు చేశారు. శాంతి భద్రతలు, షీ టీమ్స్‌, సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో రాష్ట్రానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయన్నారు. పోలీసుశాఖ సేవలు, పురస్కారాలు చాలా పారదర్శకంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు ఎక్కడా లేవని సీపీ అంజనీ కుమార్‌ స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని