కరోనాపై 2 లక్షల ఫోన్‌కాల్స్‌కు జవాబులిచ్చాం

దేశంలో కొవిడ్‌-19 నియంత్రణ పరిస్థితిని కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి హర్షవర్దన్‌ సమీక్షించారు. ప్రభుత్వ పరిశీలనలో ఎవరున్నారు, వ్యాధి సోకినవారిని గుర్తించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో పరిశీలించారు. మంగళవారం నాటికి 1,87,904 మంది పరిశీలనలో ఉన్నారు. 35,073 మంది 28 రోజులు పరిశీలన..

Published : 24 Mar 2020 22:24 IST

దిల్లీ: దేశంలో కొవిడ్‌-19 నియంత్రణ పరిస్థితిని కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి హర్షవర్దన్‌ సమీక్షించారు. ప్రభుత్వ పరిశీలనలో ఎవరున్నారు, వ్యాధి సోకినవారిని గుర్తించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో పరిశీలించారు. మంగళవారం నాటికి 1,87,904 మంది పరిశీలనలో ఉన్నారు. 35,073 మంది 28 రోజులు పరిశీలన కాలాన్ని పూర్తి చేసుకున్నారు. మొత్తం 12,872 పరీక్షలు చేయగా అందులో 2,023 జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థ (ఎన్‌సీడీసీ) చేసింది. అందులో 52 మందికి కొవిడ్‌-19 సోకినట్లు తెలిపింది.

ఎన్‌సీడీసీ కంట్రోల్‌ రూమ్‌, ప్రయోగశాలను పరిశీలించిన హర్షవర్దన్‌ అక్కడి సీనియర్‌ అధికారులతో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ ఎండీ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పర్యవేక్షకులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎన్‌సీడీసీ ముందుండి కేసులను పరిశీలిస్తోందని పేర్కొన్నారు. కష్టకాలంలో ఎంతో శ్రమిస్తున్న శాస్త్రవేత్తలు, ఆరోగ్య స్పందన బృందం, సాంకేతిక నిపుణులు, ప్రయోగ శాలల సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇప్పటి వరకు కంట్రోల్‌ రూమ్‌ ద్వారా రెండు లక్షలకు పైగా ఫోన్‌కాల్స్‌కు సమాధానాలు చెప్పారని మంత్రి వెల్లడించారు. 52,000 ఈ మెయిల్స్‌కు సైతం బదులిచ్చారన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మున్ముందు ఇలాగే పనిచేయాలని ఆయన సూచించారు. ‘ప్రజలు స్వీయనిర్బంధంలో ఉండటం ఇప్పుడవసరం. సోషల్‌ డిస్టెన్స్‌ కచ్చితంగా పాటించాలి. ఆరోగ్యంగా ఉండాలి. పెద్దవారు, గర్భిణులు, చిన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి’ అని మంత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని