యోగా, బుక్స్‌, సంగీతంతో కరోనాను జయించాం

చైనాలో పుట్టిన నావెల్‌ కరోనా వైరస్‌ సోకితే ఏమైపోతామోనని చాలామంది భయపడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ప్రభుత్వం, వైద్యులు చెప్పినా ఆందోళన చెందుతున్నారు. అయితే సానుకూల దృక్పథంతో ఎదుర్కొంటే ఎలాంటి రోగమైనా తగ్గుతుందని పుణెకు చెందిన ఓ కుటుంబం

Published : 28 Mar 2020 01:10 IST

సానుకూల దృక్పథం, సామాజిక దూరమే వైరస్‌ను చంపేందుకు ఆయుధాలు

కోలుకొని ఇంటికి వెళ్లిన మహారాష్ట్రలోని ఓ కుటుంబ అభిప్రాయం

పుణె: చైనాలో పుట్టిన నావెల్‌ కరోనా వైరస్‌ సోకితే ఏమైపోతామోనని చాలామంది భయపడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ప్రభుత్వం, వైద్యులు చెప్పినా ఆందోళన చెందుతున్నారు. అయితే సానుకూల దృక్పథంతో ఎదుర్కొంటే ఎలాంటి రోగమైనా తగ్గుతుందని పుణెకు చెందిన ఓ కుటుంబం నిరూపించింది. ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, యోగా చేయడం, చక్కని సంగీతం వినడం వల్ల కరోనా నుంచి త్వరగా కోలుకున్నామని వెల్లడించింది. మహారాష్ట్రలో కరోనా బారిన పడి కోలుకొని ఇంటికెళ్లిన తొలి కుటుంబం చెప్పిన వివరాలివీ.

పుణెకు చెందిన ఓ కుటుంబం దుబాయ్‌కు వెళ్లి వచ్చింది. 51 ఏళ్ల వ్యక్తి, అతడి భార్య, కుమార్తె (23 ఏళ్లు)కు కరోనా వైరస్‌ సోకింది. దుబాయ్‌ నుంచి వచ్చిన రెండో రోజు ఆ వ్యక్తికి సాధారణ జ్వరం, దగ్గు వచ్చాయి. కుటుంబ వైద్యుడి సలహా మేరకు మందులు వాడారు. తగ్గకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి నమూనాలు పరీక్షించగా పాజిటివ్‌గా తేలింది. ‘దుబాయ్‌ నుంచి మార్చి 1న నేను, నా భార్య, కూతురు పుణెకు వచ్చాం. అదేరోజు రాత్రి నాకు జ్వరం రావడంతో మాత్రలు వాడాను. తర్వాతి రోజు కుటుంబ వైద్యుడు దగ్గు, జ్వరానికి గాను మూడు రోజులకు మందులు రాసిచ్చారు’ అని ఆ కుటుంబ యజమాని తెలిపారు.

మూడు రోజుల తర్వాతా ఆయనకు లక్షణాలు తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులంతా నాయుడు ఆస్పత్రికి వెళ్లారు. మార్చి 9న వారి నివేదికలు వచ్చాయి. ‘ఆ నివేదికలను మాకు నేరుగా ఇవ్వలేదు. మా దుబాయ్‌ పర్యటన, ఎవరెవరిని కలిశామో అడగడంతో విషయం మాకు అర్థమైంది. నేను కాస్త నొక్కి అడగడంతో పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. మేమంతా దిగ్భ్రాంతికి గురయ్యాం. నా భార్య ఏడ్చింది. విషయాన్ని నమ్మలేకపోయింది. వ్యాధి లక్షణాలు ఎక్కువగా లేవని వైద్యులు ఊరడించారు’ అని ఆయన అన్నారు.

‘మా కూతురు, అబ్బాయినీ ఆస్పత్రికి పిలిపించారు. మమ్మల్ని ఐసోలేషన్‌కు పంపించారు. ఆ తర్వాత రోజే మా కూతురు, మమ్మల్ని తీసుకొచ్చిన కారు డ్రైవర్‌, మరొకరికి పాజిటివ్‌ వచ్చిందని తేలింది. వైరస్‌ను తీసుకొచ్చామని రెండో రోజు మా కుటుంబం గురించి సోషల్‌ మీడియాలో అనైతికంగా మాట్లాడుకున్నారు. మమ్మల్ని నిందించారు. అయితే మేం సానుకూల దృక్పథంతో దీనిని జయించాలనుకున్నాం. కొన్ని రోజుల తర్వాత మమ్మల్ని జనరల్‌ వార్డుకు మార్చారు. అది చాలా పెద్దగా ఉంది. వెలుతురు బాగా వస్తోంది. మేం కసరత్తులు, యోగా చేయడం ఆరంభించాం. సామాజిక దూరం పాటిస్తూనే ఇతరులతో సానుకూలంగా మాట్లాడేవాళ్లం. యువకులేమో వీడియో స్ట్రీమింగ్‌ యాప్స్‌తో గడిపేవారు’ అని తన అనుభవాన్ని చెప్పారు.

‘మేం సంగీతాన్ని ఆస్వాదించాం. మా కుటుంబ మిత్రులు కొన్ని పుస్తకాలు తీసుకొచ్చారు. ఐసోలేషన్‌లో మేం సావర్కర్‌, శివాజీ మహరాజ్‌, రాబర్ట్‌ కియోసాకి రిచ్‌డాడ్‌ పూర్‌డాడ్‌, సుధామూర్తి వైజ్‌ అండ్‌ అధర్‌వైజ్‌ పుస్తకాలు చదివాం’ అని ఆయన అన్నారు. వాళ్ల కూతురు ఓ ఐటీ సంస్థలో పనిచేస్తోంది. పర్యటించడం అంటే తమకెంతో ఇష్టమని తెలిపింది. ‘ఇది మా జీవితాలను పూర్తిగా మార్చేసింది. ఈ పరిస్థితిని మా కుటుంబం సానుకూలంగా ఎదుర్కొంది. ఈ పరీక్షా సమయంలో మా కార్యాలయం, స్నేహితులు, బంధువులు మాకెంతో అండగా  నిలిచారు. ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలంటే సోషల్‌ డిస్టన్స్‌ పాటించడమే శరణ్యం’ అని ఆమె పేర్కొంది.

ఆ కుటుంబం మార్చి 25న పూర్తిగా కోలుకొని ఇంటికి తిరిగొచ్చింది. ఆ సమయంలో అక్కడున్న పొరుగువారు, హౌజింగ్‌ సొసైటీ సభ్యులు చప్పట్లు కొడుతూ వారిని స్వాగతించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని