India-US: ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్‌లో ఉన్నాం: అమెరికా

గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర కేసుపై వచ్చిన మీడియా కథనంపై వ్యాఖ్యానించేందుకు అమెరికా విదేశాంగశాఖ అధికారి నిరాకరించారు. ఈ అంశంతో తాము న్యూదిల్లీతో టచ్‌లోనే ఉన్నామన్నారు.

Published : 01 May 2024 11:50 IST

వాషింగ్టన్‌: సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు అమెరికా (USA)లో జరిగిన కుట్ర వెనుక భారత (India) గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక ప్రచురించిన కథనం వివాదాస్పదమైంది. ఈ కథనాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలపై అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ మాట్లాడారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం భారత్‌తో నిరంతం కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు.

‘‘ఈ కేసులో భారత్‌ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ కనుగొన్న అంశాల ఆధారంగా న్యూదిల్లీ బాధ్యతాయుతంగా వ్యహరిస్తుందని భావిస్తున్నాం. కేసులో అదనపు అప్‌డేట్ల గురించి ఎప్పటికప్పుడు న్యూదిల్లీని ఆరా తీస్తున్నాం’’ అని పటేల్‌ తెలిపారు. ఈ సందర్భంగా వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం గురించి అడగ్గా.. ‘‘ఈ అంశంపై మేం భారత ప్రభుత్వంలోని సీనియర్‌ స్థాయి అధికారులతో చర్చలు జరుపుతున్నాం. అంతకు మించి మేం దీని గురించి వ్యాఖ్యానించలేను. దీన్ని న్యాయశాఖకు వదిలేస్తున్నాం’’ అని స్పష్టం చేశారు.

గురుపత్వంత్‌పై హత్యాయత్నం వెనుక ‘రా’!

అమెరికాలోని సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జె) సంస్థ అధికార ప్రతినిధి గురుపత్వంత్‌ సింగ్‌ ఖలిస్థానీల కీలక నేత. భారత ప్రభుత్వం అతనిని ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే, పన్నూ హత్యకు తమ గడ్డపై కుట్ర జరిగిందని గతేడాది ఆరోపించిన అమెరికా.. ఈ కేసులో ఓ భారతీయుడిపై అభియోగాలు కూడా మోపింది. ఈ క్రమంలోనే ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు భారత ప్రభుత్వం ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

అయితే, ఈ కుట్రలో ‘రా’ అధికారి ప్రమేయం ఉందంటూ యూఎస్‌ మీడియాలో కథనం రావడం చర్చనీయాంశమైంది. దీన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ‘‘ఒక సున్నితమైన అంశంపై ఆ నివేదిక నిరాధారమైన, అనవసర ఆరోపణలు చేస్తోంది. వ్యవస్థీకృత నేరగాళ్లు, ఉగ్రవాదులు, ఇతరుల నెట్‌వర్క్‌లపై యూఎస్‌ ప్రభుత్వం అందించిన భద్రతా సమస్యలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అది దర్యాప్తు కొనసాగిస్తోంది. అలాంటి సమయంలో ఇలాంటి ఊహాజనితమైన, బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చవు’’ అని భారత విదేశాంగశాఖ మండిపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని