పీఎంజీకేపీ ద్వారా 42 కోట్ల మందికి లబ్ధి

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన 42 కోట్ల మంది పేదవారికి ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్ ప్యాకేజి కింద....

Published : 03 Jun 2020 23:51 IST

దిల్లీ: కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన 42 కోట్ల మంది పేద వారికి ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్ ప్యాకేజీ (పీఎంజీకేపీ) కింద రూ.53,248 కోట్ల నగదు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా సంక్షోభం కారణంగా ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు మార్చి 26న కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ద్వారా ఉచితంగా ఆహార ధాన్యాలు, మహిళలు, వృద్ధులు, రైతులకు నగదు చెల్లింపులు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ప్యాకేజీ అమలు తీరును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పర్యవేక్షించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.

‘‘సుమారు రూ.42 కోట్ల మంది లబ్ధిదారులు పీఎంజీకేపీ కింద రూ.53,248 కోట్ల ఆర్థిక సహాయాన్ని పొందారు. మొదటి దశలో పీఎం-కిసాన్‌ ద్వారా 8.19 కోట్ల మంది లబ్ధి దారులకు రూ.16,392 కోట్లు చెల్లించాం. మహిళల జన్‌ధన్‌ ఖాతాల్లోకి రెండు విడతలుగా రూ.20,334 కోట్ల నగదు బదిలీ చేశాం. అలానే 2.81 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రెండు విడతలుగా రూ.2,814.5 కోట్ల నగదును పంపిణీ చేశాం. పీఎంజీకేపీ కింద 2.3 కోట్ల మంది భవన నిర్మాణ రంగ కార్మికులకు రూ.4,312.82 కోట్ల ఆర్థిక సాయం చేశాం’’ అని ఆర్థిక శాఖ వెల్లడించింది.

ఏప్రిల్ నెలలో 36 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు 101 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలు సరఫరా చేయగా, వాటిని దశల వారీగా ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో లబ్ధిదారులకు అందజేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయువై) ద్వారా 9.25 కోట్ల ఎల్పీజీ సిలిండర్లు బుక్‌ అవ్వగా ఇప్పటి వరకు 8.58 కోట్ల సిలిండర్లు డెలివరీ చేసినట్లు వెల్లడించింది. అలానే ఈపీఎఫ్ఓ ఖాతాల ద్వారా 16.1 లక్షల మందికి రూ.4,275 కోట్ల నాన్‌ రిఫండబుల్‌ అడ్వాన్స్‌ అందజేసినట్లు తెలిపారు. 24 శాతం ఈపీఎఫ్ చందాను 59.23 లక్షల మంది ఉద్యోగుల ఖాతాలకు బదిలీ చేసినట్లు ఆర్థికశాఖ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని