IT: రండిక కార్యాలయాలకు.. ఉద్యోగులను వెనక్కి రప్పించేందుకు ఐటీ సంస్థల ప్రణాళికలు 

కరోనా భయంతో సుమారు ఏడాదిన్నరగా ఐటీ ఉద్యోగులకు ‘ఇంటి నుంచి పని’ అవకాశం కల్పించిన ఐటీ కంపెనీలు..

Published : 19 Sep 2021 13:11 IST

చేరేందుకు గడువు చెబుతున్న కంపెనీలు
మార్చి నాటికి 70 శాతం మంది  హాజరు లక్ష్యం

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా భయంతో సుమారు ఏడాదిన్నరగా ఐటీ ఉద్యోగులకు ‘ఇంటి నుంచి పని’ అవకాశం కల్పించిన ఐటీ కంపెనీలు.. నెమ్మదిగా వారందరినీ కార్యాలయాలకు రప్పించే ప్రణాళికలు రచిస్తున్నాయి. విడతల వారీగా తమ ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని కోరుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, కుటుంబసభ్యులకు నూరు శాతం వ్యాక్సినేషన్‌ త్వరలో ముగియనున్న నేపథ్యంలో ఈ మేరకు కసరత్తు చేస్తున్నాయి. కొన్ని దేశీయ పెద్ద కంపెనీలు, చిన్న, మధ్యతరహా ఐటీ సంస్థలు దసరా నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నాయి. ఈ ఏడాది చివరికల్లా కనీసం 50శాతం ఉద్యోగులు కార్యాలయాల్లో పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు విదేశీ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లోని తమ ఉద్యోగులు జనవరి నాటికి కార్యాలయాలకు వచ్చేందుకు సిద్ధం కావాలని ఇప్పటికే ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం అందిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది

రాష్ట్రంలోని 1500కు పైగా ఐటీ కంపెనీల్లో దాదాపు 6.28లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ప్రస్తుతం 90 శాతం మంది ఇంటి నుంచి పని(వర్క్‌ ఫ్రం హోం) విధానంలో సేవలందిస్తున్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడి అనేక ఇతర వర్గాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రభుత్వం ఐటీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యమిచ్చింది. పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌లో సహకరించాయి. ఈ క్రమంలో మరో నెలలోగా ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబాలకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ దాదాపు ముగియనున్నట్లు తెలిసింది. దీంతో నెమ్మదిగా సిబ్బందిని ఆఫీసులకు రప్పించాలని కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. 2022 మార్చికల్లా 70 శాతం మంది ఉద్యోగులను కార్యాలయాలకు తీసుకురావాలన్న లక్ష్యంలో భాగంగా వారిని అప్రమత్తం చేస్తున్నాయి.

తిరిగి కుదురుకోవాలంటే..

ఇంటి నుంచి పని విధానంలో భాగంగా హైదరాబాద్‌ ఐటీ ఉద్యోగుల్లో దాదాపు 40 శాతం మంది నగరానికి దూరంగా సొంతూళ్లలో ఉన్నారు. వారంతా తిరిగి వచ్చి, అద్దె ఇళ్లు వెతుక్కోవడం, వసతి గృహాల్లో చేరడానికి సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో ముందస్తు అప్రమత్త చర్యల్లో భాగంగా కంపెనీలు సమాచారమిస్తున్నట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘ప్రస్తుతం కార్యాలయాలకు పది శాతం మంది ఉద్యోగులు వస్తున్నారు. మిగతా వారు విడతల వారీగా అక్టోబరు నుంచి ఆరంభించి డిసెంబరు నాటికి కనీసం 40శాతం మంది వచ్చేలా ఐటీ కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఐటీ ఉద్యోగుల రెండు డోసుల వ్యాక్సినేషన్‌ త్వరలో పూర్తికానుంది.’’ అని హైసియా అధ్యక్షుడు భరణికుమార్‌ ఆరోల్‌ తెలిపారు. ‘‘ప్రభుత్వ ఒత్తిడితో కంపెనీలు తమ ఉద్యోగులను కార్యాలయాలకు రావాలంటూ సమాచారం ఇస్తున్నాయి. వారలా వచ్చినా కరోనా చేదు అనుభవాల నేపథ్యంలో ధారాళంగా గాలి, వెలుతురు ఉండేలా ఆఫీసు వాతావరణాన్ని రీ డిజైన్‌ చేయాలి. ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లతో పాటు ఆరోగ్య భద్రత బాధ్యతను ఐటీ సంస్థలు, ప్రభుత్వం తీసుకోవాలి’’ అని ఫోరం ఫర్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌ అధ్యక్షుడు కిరణ్‌చంద్ర పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని