Andhra News: పులివెందులలో ఆర్టీసీ బస్టాండు మూసివేత

అత్యాధునిక సౌకర్యాలతో 12 ఎకరాల్లో రూ.35 కోట్లతో ఆర్టీసీ మోడల్‌ బస్టాండును నిర్మిస్తున్నాం.

Updated : 05 Apr 2022 09:12 IST

నత్తనడకన కొత్త ప్రాంగణం పనులు

 మండుటెండలో నిత్యం వేలాది మంది ప్రయాణికులకు నరకయాతన

సీఎం జగన్‌ ఇలాకాలో ఇదీ దుస్థితి 

అత్యాధునిక సౌకర్యాలతో 12 ఎకరాల్లో రూ.35 కోట్లతో ఆర్టీసీ మోడల్‌ బస్టాండును నిర్మిస్తున్నాం. అందరూ ఆశ్చర్యపడిపోయేలా ఇది ఉంటుంది. ఇప్పుడున్న బస్టాండులో మల్టీకాంప్లెక్స్‌ను నిర్మిస్తాం.- 2020 డిసెంబరు 24న పులివెందుల సభలో సీఎం జగన్‌ వ్యాఖ్యలు

అయితే... ప్రస్తుతం ఆర్టీసీ మోడల్‌ బస్టాండు నిర్మాణం పనులు నత్తనడకన నడుస్తున్నాయి.  ఏడాది లోగా పూర్తయ్యేలా లేవు. ఆ లోగా ఇప్పుడు ఉన్న బస్టాండును అకస్మాత్తుగా మూసివేసి మల్టీ కాంప్లెక్స్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు భగభగ మండే ఎండలో రోడ్లపైనే బస్సుల కోసం వేచి చూస్తూ పడరాని పాట్లు పడుతున్నారు. ఈ పరిస్థితిపై పులివెందులతో పాటు పరిసర ప్రాంతాల వాసులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

ఈనాడు డిజిటల్, కడప, న్యూస్‌టుడే- పులివెందుల:  పులివెందులలో నలభై ఏళ్ల కిందట ఓ దాత ఇచ్చిన స్థలంలో ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మించారు. దీన్ని పది రోజుల కిందట అకస్మాత్తుగా మూసివేశారు. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే ప్రయాణికులు నిలవనీడలేని అన్న క్యాంటీన్‌ ప్రాంగణానికి తాత్కాలిక బస్టాండును తరలించేశారు. ఇక్కడ ఉన్న 4.26 ఎకరాల విసీˆ్తర్ణంలో రూ.87.50 కోట్లతో అత్యాధునిక సిటీ సెంట్రమ్, ఆడిటోరియం, దుకాణాలు నిర్మించాలని సంకల్పించారు. దుకాణాలపై అధికార పార్టీ నేతలకు కన్నుపడడంతో కొత్త బస్టాండు నిర్మాణం కాకుండానే...  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే హడావుడిగా ప్రయాణికుల ప్రాంగణాన్ని మూసివేశారనే విమర్శలు వెల్లువెత్తాయి.  దాంతో రెండు రోజుల కిందట వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణానికి తాత్కాలిక ఆర్టీసీ బస్టాండును ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్లాలంటే మూడు కిలో మీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సి ఉంటోందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రయాణికులు అంతదూరం వెళ్లలేక రహదారులపైనే నిలబడాల్సి వస్తోంది. ఈ బస్టాండ్‌ నుంచి నిత్యం 200 వరకు బస్సులు పలు ట్రిప్పులతో రాకపోకలు సాగిస్తున్నాయి. 

నీ పులివెందుల నుంచి కడప, కదిరి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, సింహాద్రిపురం, అనంతపురం, తాడిపత్రి, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పట్టణంలోని రహదారులకు ఇరువైపులా నిల్చొని బస్సులను ఆశ్రయిస్తున్నారు. మార్కెట్‌ యార్డులోని తాత్కాలిక బస్టాండ్‌లో ప్రయాణికులకు కూర్చోవడానికి కూడా కుర్చీలు లేవు. మండుటెండలో రోడ్డు పక్కన నిలబడి ప్రయాణికులు తాము వెళ్లే ప్రదేశాలకు బస్సులు ఎక్కుతున్నారు. కొన్ని చోట్ల కొందరు దాతలు చలువ పందిళ్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు కొంతమేర సేదతీరుతున్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళల ఇబ్బందులు వర్ణనాతీతం.

వసతులు కల్పిస్తున్నాం

పట్టణంలోని తితిదే కల్యాణ మండపం ఎదురుగా 12 ఎకరాల్లో రూ.34.2 కోట్ల అంచనాతో కొత్త ఆర్టీసీ బస్టాండ్, గ్యారేజీ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందులో ఆర్టీసీ గ్యారేజీ పనులు పూర్తయ్యాయి. బస్టాండ్‌ నిర్మాణ దశలోనే ఉంది. ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నది వాస్తవమే. క్రమంగా వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. -వన్నూర్‌ సాహెబ్, ఆర్టీసీ డీఎం, పులివెందుల  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని