రుషికొండ రుసుముపై జనాగ్రహం

ఆహ్లాదకర వాతావరణానికి విశాఖ పెట్టింది పేరు. సిటీ ఆఫ్‌ డెస్టినీగా పేరుగాంచింది. వారాంతాల్లో నగర ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారు వస్తారు.

Updated : 10 Jul 2023 05:44 IST

వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రకటన చేసిన మంత్రి అమర్‌నాథ్‌

ఈనాడు, విశాఖపట్నం : ఆహ్లాదకర వాతావరణానికి విశాఖ పెట్టింది పేరు. సిటీ ఆఫ్‌ డెస్టినీగా పేరుగాంచింది. వారాంతాల్లో నగర ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారు వస్తారు. ఒత్తిడితో సతమతమయ్యేవారు బీచ్‌లో కాసేపు సేదతీరేందుకు ఆసక్తి చూపుతారు. ఇందుకు రుషికొండ బీచ్‌కు వెళ్లే వారి సంఖ్య అధికం. ఈ బీచ్‌లోకి వెళ్లడానికి జిల్లా యంత్రాంగం ప్రవేశ రుసుం నిర్ణయించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బీచ్‌ను చూసేందుకు డబ్బులు చెల్లించడమేంటి? ఇదేం పనంటూ పర్యాటకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారంటే రేపు ఇంకేమైనా చేస్తారని అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. జులై 11 నుంచి దీన్ని అమలు చేయాలని తొలుత నిర్ణయించగా ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై వెనక్కి తగ్గింది. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఆదివారం బీచ్‌కు వచ్చిన పర్యాటకులు ప్రవేశ రుసుం ఏర్పాటు గురించి తెలుసుకొని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజల కోసం ఆ మాత్రం ఖర్చు భరించలేదా అంటూ అసహనం వ్యక్తం చేశారు.

వసూలు చేయం..

రుషికొండ బీచ్‌లో ప్రవేశానికి ఎటువంటి రుసుం వసూలు చేయమని మంత్రి అమర్‌నాథ్‌ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ‘బ్లూఫ్లాగ్‌ బీచ్‌ అవ్వడంతో కేంద్ర నిబంధనల ప్రకారం పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు రుసుం వసూలు చేయాలి. పర్యాటకశాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌తో సమీక్షించిన తరువాత ప్రవేశ రుసుం నిర్ణయం తీసుకున్నారు. అయితే, బీచ్‌లో సౌకర్యాలు కల్పించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. పర్యాటకులు ఎటువంటి రుసుం చెల్లించనక్కర్లేద’ని ఆయన పేర్కొన్నారు.

సామాన్యులకు భారమే..

బీచ్‌లో ప్రవేశానికి డబ్బులు పెట్టడం సరికాదు. ఇక్కడికి అధికంగా సామాన్యులే వస్తారు. దీన్ని ఉచితంగానే నిర్వహించాలి. పది మంది కుటుంబ సభ్యులు ఆటో బేరం ఆడుకొని వస్తే ఆటో డబ్బులతో పాటు అదనంగా బీచ్‌లోకి వెళ్లడానికి రూ.200 ఖర్చు అవుతుందంటే ఆలోచిస్తారు. ఆ డబ్బులు ఉంటే ఏదైనా తినడానికి ఖర్చు చేస్తారు. ఛార్జీలకు ఉపయోగపడతాయి. 30 ఏళ్లుగా ఇక్కడికి వస్తున్నా, ఎప్పుడూ ఇలా లేదు. ఇలా ఉంటే రావడానికి ఎవరూ ఇష్టపడరు. ఇక్కడికి పర్యాటకులు వస్తేనే కదా పది మందికి ఉపాధి దొరుకుతుంది.

శ్రీరామ్‌ యాదవ్‌, ఆటో డ్రైవర్‌

గోవాలోనే లేదు..

దేశంలో గతంలో తిరిగిన బీచ్‌ల్లో ఎక్కడా ప్రవేశ రుసుం లేదు. గోవాలోనే లేదు. అటువంటిది ఏపీలో వసూలు చేస్తామంటే ఆశ్చర్యం కలుగుతుంది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక పర్యావరణాన్ని కూడా వదలడం లేదు. దోచుకోవడానికే చూస్తున్నారు. కారులో వచ్చే వారికి కారు పార్కింగ్‌తో పాటు ఎంతమంది వస్తే అన్ని రూ.20లు చెల్లించాలంటే ఎలా? మొదటిసారిగా ఇక్కడే వింటున్నాం.

హేమంత్‌, ఖమ్మం

సేదతీరేందుకు వస్తే డబ్బులా?

పర్యాటక ప్రాంతంలో సందర్శకుల నుంచి ప్రవేశ రుసుం వసూలు చేయడం సరైన నిర్ణయం కాదు. వారాంతంలో పిల్లలతో వస్తుంటాం. కుటుంబంతో కాసేపు సేదతీరేందుకు వచ్చినా డబ్బులు చెల్లించడం అనేది ఇబ్బందికరం. మాది తణుకు. ప్రతి రెండు, మూడు వారాలకు ఇక్కడి బీచ్‌కు వస్తుంటా. పార్కింగు ఫీజుతోనే ఇబ్బంది పడుతున్నాం. మనిషికి రూ.20 హర్షించదగ్గది కాదు.

టీఎస్‌ స్వరూప్‌, తణుకు

ప్రజల్ని బాదితే కానీ..

పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజాకు ఆదాయం ఎలా తీసుకురావాలో తెలియక దీన్ని అమలు చేస్తున్నట్లు ఉంది. వాహనాల పార్కింగుకూ తీసుకొని, లోపలికి వెళ్లేందుకూ తీసుకుంటే అర్థముందా? భవిష్యత్తులో ఇసుక ముట్టుకున్నా, సముద్రాన్ని చూడాలన్నా ధర నిర్ణయిస్తారేమో. ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు పరుగులు తీయాలంటే ఈరకంగా ప్రజల నెత్తిన బాదాల్సిందేనేమో. ప్రభుత్వ పథకాలు అమలవ్వాలంటే  ఇలాంటివి చేయక తప్పని స్థితి కాబోలు.

నాయుడు, విశాఖ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని