Avinash Reddy: అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది.

Updated : 25 May 2023 18:47 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. వాదనలకు ఎంత సమయం పడుతుందని  తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ అడిగారు. వాదనలకు గంటల సమయం పడుతుందని న్యాయవాదులు తెలపడంతో శుక్రవారం ఉదయం 10.30గంటలకు వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. 

అవినాష్‌రెడ్డి ఏప్రిల్‌లో దాఖలుచేసిన పిటిషన్‌పై విచారించిన సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ.. రోజూ విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. రాతపూర్వకంగా ప్రశ్నావళి ఇవ్వాలని సీబీఐని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేస్తూ తాజాగా విచారణ చేపట్టాలంటూ ఏప్రిల్‌ 24న ఉత్తర్వులిచ్చింది. 

ఆ నేపథ్యంలో ఏప్రిల్‌ 27, 28 తేదీల్లో విచారణ చేపట్టినా వాదనలు పూర్తికాకపోవడంతో జూన్‌ 5వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఇందులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి, జ్యుడిషియల్‌ ప్రొసీడింగ్స్‌ జారీచేయడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేయడంతో అవినాష్‌రెడ్డి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత వారం విచారణకు వచ్చినా వాయిదా పడటంతో దీనిపై మంగళవారం విచారణ చేపట్టింది. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని, తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ ఈ నెల 25న విచారణ చేపట్టి అవసరమైన ఉత్తర్వులు జారీచేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వెకేషన్‌ బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ విచారణను రేపటికి వాయిదా వేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు