Knee: మోకీలు మార్పిడి ఎందుకు అవసరం..! తెలుసుకోండి

వయసు పెరుగుతున్న కొద్దీ మోకీళ్లలో గుజ్జు అరిగిపోతుంది. అయినా నొప్పి తగ్గకపోతే మోకీలు మార్చక తప్పదని వైద్యులు సూచిస్తున్నారు.

Updated : 15 Oct 2022 15:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మోకీలు..ఇది మన శరీరాన్ని మోసే ఓ ప్రధాన భాగం. ఇది అద్భుతమైన అమరిక. సంక్లిష్టమైన నిర్మాణం. రోజువారీ పనులకు ఆయువుపట్టు. అది సక్రమంగా లేకపోతే నడవడం మాత్రమే కాదు.. నిలపడటం కూడా కష్టమే. వయసు పెరుగుతున్న కొద్దీ మోకీళ్లలో గుజ్జు అరిగిపోతుంది. అయినా నొప్పి తగ్గకపోతే మోకీలు మార్చక తప్పదని వైద్యులు సూచిస్తున్నారు. ఊబకాయం, బహుళ అంతస్తుల్లో జీవనంతో మోకాళ్లపై భారం పడుతోందని సీనియర్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ గురవారెడ్డి వివరించారు.

కారణాలివీ..

* ప్రధానంగా వయసు, బరువుతోనే మోకాళ్లు అరిగిపోతున్నాయి. స్థూలకాయం, వ్యాయామం లేకపోవడంతో చిన్న వయసులోనే నొప్పులు పెరుగుతున్నాయి.  

* మోకాళ్లకు తొడ కండరాలు చాలా కీలకం. ఈ కండరాల వ్యాయామం చేయకపోవడంతో మోకాళ్లపై భారం పడుతోంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఎక్కువ సమయం కుర్చీకే పరిమితం కావడంతో నొప్పులు పెరుగుతున్నాయి.

*  మోకాళ్ల ఆరుగుదల నాలుగు దశల్లో కొనసాగుతుంది. మూడు, నాలుగు దశల్లో తీవ్రస్థాయికి చేరుతుంది. ఎముకల్లోని గుజ్జు పెరగడానికి మందులు లేవు. కానీ ఉన్న గుజ్జును కాపాడుకోవడానికి మందులు అందుబాటులో ఉన్నాయి. నొప్పి అధికంగా ఉంటే పారాసిటామాల్‌ వేసుకుంటే చాలు. పెయిన్‌ కిల్లర్లను అధికంగా వాడొద్దు.

మోకీలు మార్పిడి తప్పదా...?

మోకీలు నొప్పి వారానికి పైగా ఉన్నపుడు వైద్యులను కలవాలి. ఫిజియోథెరపీ, నడక, ఈత, సైక్లింగ్‌ నొప్పులను తగ్గిస్తాయి. పూర్తిగా నడక సాధ్యం కానపుడు, లేవలేనిస్థితి కలిగినపుడు ఆపరేషన్‌ చేయించుకోవాల్సి వస్తుంది. దాదాపుగా 99 శాతం ఆపరేషన్లు విజయవంతం అవుతున్నాయి. నొప్పి తగ్గించడానికి చాలా మందులు వచ్చాయి. మోకాళ్లపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులుండవు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని