SBI: షార్ట్స్‌లో బ్యాంకుకు వెళ్లిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

‘షార్ట్స్‌’ ధరించి ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. తమ ఖాతాదారులు బ్యాంకు శాఖలో హుందాగా వ్యవహరించాలని తాము కోరుకుంటామని అక్కడి సిబ్బంది అతనికి హితవు పలికారు.....

Published : 21 Nov 2021 15:38 IST

కోల్‌కతా: ‘షార్ట్స్‌’ ధరించి ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. తమ ఖాతాదారులు బ్యాంకు శాఖలో హుందాగా వ్యవహరించాలని తాము కోరుకుంటామని అక్కడి సిబ్బంది అతనికి హితవు పలికారు. ప్యాంటు ధరించి రావాలని తిప్పి పంపారు. కోల్‌కతాలో ఆశిష్‌ అనే యువకుడు ఈ చేదు అనుభవం చవిచూశాడు.

ఆశిష్‌ ఈ విషయాన్ని నవంబరు 16న ట్విటర్‌ వేదికగా ఎస్‌బీఐ దృష్టికి తీసుకెళ్లాడు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయని తెలిపాడు. వినియోగదారులు ఎలాంటి దుస్తులు ధరించాలన్న దానిపై కచ్చితమైన నిబంధనలేమైనా ఉన్నాయా అని ప్రశ్నించాడు. ఈ ట్వీట్‌ వైరల్‌గా అయ్యింది. ఎస్‌బీఐపై అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయాలంటూ పలువురు కామెంట్ల రూపంలో సూచించారు.

దీంతో ఎస్‌బీఐ స్పందించింది. తమ బ్యాంకు శాఖలకు వచ్చే కస్టమర్లు ధరించే దుస్తులపై ఎలాంటి నియమ నిబంధనలు లేవని స్పష్టం చేసింది. వారి అభీష్టానికి అనుగుణంగా దుస్తులు ధరించొచ్చని తెలిపింది. అయితే, బ్యాంకు శాఖ ఉన్న ప్రాంతంలో ఆచరించే సంస్కృతి, సంప్రదాయాలను అనుసరించి.. అందరికీ ఆమోదనీయమైన దుస్తులు ధరించడం మేలని సూచించింది. అయితే, ఏ బ్యాంకులో ఈ ఘటన జరిగిందో చెబితే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఆశిష్‌ వివరాలు అందజేయడంతో అక్కడి సిబ్బందితో మాట్లాడతామని హామీ ఇచ్చింది.

అయితే, తమ స్థానిక ఎస్‌బీఐ అధికారులు తమ ఇంటికి వచ్చారని.. సమస్య పరిష్కారం అయ్యిందని ఆశిష్‌ నవంబరు 20న మరోసారి ట్వీట్‌ చేశాడు. ఇంతటితో ఈ సమస్యకు ముగింపు పలకాలనుకుంటున్నానని.. సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని