Telangana News: యాదాద్రి ఆలయ నిర్మాణంలో వంద లోపాలు: ఎంపీ కోమటిరెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తోన్న విధానాలు ప్రజల పాలిట శాపంగా మారాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.

Published : 10 Apr 2022 01:34 IST

యాదాద్రి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తోన్న విధానాలు ప్రజల పాలిట శాపంగా మారాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన పంటను కొనాల్సిన ప్రభుత్వాలే ధర్నాలు చేస్తున్నాయని ఆక్షేపించారు. కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి కోమటిరెడ్డి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు.

‘‘ఆలయ ప్రారంభానికి నన్ను పిలవలేదు. ప్రభుత్వ డైరెక్షన్ ప్రకారమే ఆలయ ఉద్ఘాటనకు పిలవలేదు. మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించకుండా ఆలయాన్ని ప్రారంభించి భక్తులను ఇబ్బంది పెట్టడం సరికాదు. యాదాద్రిలో ప్రభుత్వం లేనిపోని ఆంక్షలు విధించి భక్తులను ఇబ్బంది పెట్టొద్దు. ప్రజల సొమ్ముతో ఆలయాన్ని నిర్మించి తెరాస నేతలకే సొంతమన్నట్లు ప్రజలపై ఆంక్షలు పెడుతున్నారు. ఆలయ నిర్మాణంలో వంద లోపాలున్నాయి. వెంటనే ఆటోలను కొండపైకి అనుమతించాలి. యాదాద్రికి 22 సార్లు వచ్చిన సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టలో ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లయినా కట్టించారా? భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తానని చెప్పి ఎనిమిదేళ్లవుతున్నా నయా పైస ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక భద్రాచలం ఆలయాన్ని కేసీఆర్ పట్టించుకోలేదు. రూ.200 కోట్లతో భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. యాదాద్రి అభివృద్ధిలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని