KTR London Tour: విభేదాలు పక్కనపెట్టి భారతదేశం, తెలంగాణ ప్రగతికి కృషి చేద్దాం: కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ప్రగతిని కొనసాగించేందుకు సహకరించాలంటూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. లండన్‌లో జరిగిన ‘‘మీట్ అండ్ గ్రీట్’’ కార్యక్రమంలో

Published : 21 May 2022 20:05 IST

లండన్‌: తెలంగాణ రాష్ట్ర ప్రగతిని కొనసాగించేందుకు సహకరించాలంటూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. లండన్‌లో జరిగిన ‘‘మీట్ అండ్ గ్రీట్’’ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి కేటీఆర్‌ ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో సాధించిన విజయాలను మంత్రి తన ప్రసంగం ద్వారా వివరించారు. ప్రవాస భారతీయులు తెలంగాణ ఉద్యమానికి మద్ధతుగా నిలిచారని.. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలంగాణను నిరంతరం ప్రోత్సహిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా తన బృందంతో పర్యటిస్తున్న తనకు వివిధ కంపెనీల అధిపతులతో ఫలప్రదమైన సమావేశాలు జరిగాయని చెప్పారు.

మాతృభూమికి తిరిగి సహకరించండి..

‘‘తెలంగాణను ప్రోత్సహించడం, పెట్టుబడులు తీసుకురావడం, ప్రజలకు ఉద్యోగాలు కల్పించడం నా పని. మేం రాబోయే రోజుల్లో యూకేతో లోతైన సంబంధాలను నెలకొల్పుతాం.  తెలంగాణలో కంపెనీ ఏర్పాటు చేయాలని యోచిస్తే మాత్రం హైదరాబాద్‌లోనే కాకుండా టైర్-2 పట్టణాల్లోనూ కార్యాలయాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించుకోండి. సంపద, ఉపాధి అవకాశాల కల్పనలో మద్దతు ఇవ్వడం ద్వారా మాతృభూమికి తిరిగి సహకరించండి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఖమ్మం, కరీంనగర్‌లో ఐటీ టవర్లు ప్రారంభించింది. త్వరలో మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో కూడా ఐటీ టవర్లు ప్రారంభిస్తాం. వరంగల్‌లో ఐటీ రంగం గొప్పగా అభివృద్ధి చెందుతోంది. నాలుగేళ్లలోపే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించడం ద్వారా లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఇది భారతదేశంలో ఉందని ప్రతి ఒక్కరూ గర్వపడుతూ చెప్పుకునేలా తీర్చిదిద్దాం.

అవన్నీ గత ఆరేళ్లలో రాష్ట్రానికి వచ్చినవే..

ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ హైదరాబాద్‌లో ఉంది. గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోన్, యాపిల్, క్వాల్‌కామ్, ఉబెర్, సేల్స్‌ఫోర్స్, నోవార్టీస్ వారి రెండో అతిపెద్ద క్యాంపస్‌లు అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అవన్నీ గత ఆరేళ్లలో రాష్ట్రానికి వచ్చినవే. తెలంగాణ సుస్థిర నాయకత్వం, సమర్థ పాలన కారణంగా ఆయా సంస్థలు రాష్ట్రాన్ని ఎంచుకున్నాయి. తెలంగాణ తలసరి ఆదాయం 2014లో రూ.1.24 లక్షలుగా ఉంది. ఏడేళ్లలో 130 శాతం పెరిగి రూ.2.78 లక్షలకు చేరింది. 2014లో జీఎస్‌డీపీ రూ.5.6 లక్షల కోట్లగా ఉంటే.. ఇప్పుడు అది రూ.11.54 లక్షల కోట్లకు పెరిగింది. భారత ప్రభుత్వ గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ అందించిన వివరాలు ఇవి. భౌగోళికంగా  తెలంగాణది 11వ స్థానం.. జనాభా ప్రాతిపదికన 12వ అతిపెద్ద రాష్ట్రం.. కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం భారతదేశ ఆర్థిక వృద్ధికి తెలంగాణ నేడు 4వ అతి పెద్ద సహకారిగా నిలిచింది. మనమందరం విభేదాలు పక్కనపెట్టి భారతదేశం, తెలంగాణ ప్రగతికి పాటుపడదాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని