KTR: పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది: కేటీఆర్‌

నగర ప్రజల సమస్యల పరిష్కారంలో జీహెచ్‌ఎంసీది ముఖ్య పాత్రని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Published : 07 Aug 2023 20:10 IST

హైదరాబాద్‌: నగర ప్రజల సమస్యల పరిష్కారంలో జీహెచ్‌ఎంసీది ముఖ్య పాత్రని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సమన్వయంతో అన్ని శాఖల అధికారులు ఒక్క దగ్గర ఉండాలన్న లక్ష్యంతో వార్డు ఆఫీసులు ఏర్పాటు చేశామన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో కేటీఆర్‌ ఇవాళ సమావేశమయ్యారు. పంతాలకు వెళ్లకుండా ఏ శాఖ అధికారులైనా జీహెచ్ఎంసీ అనుమతి తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. జవహర్‌నగర్‌ డంప్ యార్డు 8 వేల టన్నులు దాటిపోయిందని, డంప్ యార్డుల కోసం వ్యవసాయానికి యోగ్యత లేని భూమిని గుర్తించాలని రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి కలెక్టర్లను కేటీఆర్‌ ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా డంప్ యార్డ్‌లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వచ్చే చెత్తను వేరు చేసి, విద్యుత్ ఉత్పత్తి చేసేలా డంప్‌ యార్డ్‌లు ఉండాలన్నారు. దుండిగల్, ఖానాపూర్, ప్యారా నగర్ డంప్ యార్డ్‌ల అంశంలో పూర్తి నివేదికను వారంలో సమర్పించాలని సంబంధిత అధికారులను కేటీఆర్ ఆదేశించారు.

మరోవైపు, గంజాయి విక్రయంపై ఉక్కుపాదం మోపాలని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పబ్‌లు, హుక్కా సెంటర్‌లు, పాఠశాలలు, ఫామ్ హౌస్‌ల చుట్టూ పోలీసుల నిఘా పెంచాలన్నారు. ఇందుకోసం సీసీ కెమెరాలు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, మాదకద్రవ్యాల అలవాట్లు తీవ్రమైన నేరాలకు కారణం అవుతాయని ఈ సందర్భంగా కేటీఆర్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని