Rajastan: గిన్నిస్‌ రికార్డుకెక్కిన సామూహిక వివాహాలు!

రాజస్థాన్‌ (Rajastan)లో జరిగిన సామూహిక వివాహవేడుక గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు (Guinness World Record)లో చోటు సంపాదించింది. ఒకేసారి అత్యధిక జంటలు వివాహం చేసుకోవడంతో ఈ రికార్డు నమోదైంది. 

Published : 12 Jun 2023 01:42 IST

జయపుర: దేశంలో అప్పుడప్పుడు ఎక్కడో ఒకచోట సామూహిక వివాహాలు జరుగుతుంటాయి. అయితే, రాజస్థాన్‌ (Rajastan)లో జరిగిన సామూహిక వివాహాల వేడుక మాత్రం ఏకంగా గిన్నిస్‌ రికార్డు (Guinness World Record)లోకెక్కింది. 12 గంటల్లో ఎక్కువమంది పెళ్లిళ్లు చేసుకొని ప్రపంచ రికార్డు సృష్టించారు. బరాన్‌ ప్రాంతంలో మే 26న మొత్తం 2,413 జంటలు పెళ్లి చేసుకొని ఒక్కటయ్యాయి. దీంతో 2013లో 24 గంటల్లో యెమెన్‌లో 963 జంటలు ఒకేసారి వివాహం చేసుకున్న రికార్డు బద్ధలైంది. 

రాజస్థాన్‌లోని అట్టడుగు వర్గాలకు చెందిన జంటలకు శ్రీ మహవీర్‌ గోశాల కల్యాణ్‌ సంస్థాన్‌ సామూహిక వివాహాలు చేయిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల అత్యధికంగా హిందూ, ముస్లిం జంటలకు వివాహాలు జరిపించి గిన్నిస్‌ రికార్డుకెక్కేలా చేసింది. సామూహిక వివాహాల్లో పేర్లు నమోదు చేసుకున్న వధువరులు సమయం వృథా చేయకుండా ముందుగానే పూలదండలు మార్చుకొని మండపానికి చేరుకున్నారు. ప్రతి జంట 6 గంటల్లోపే వారి మత.. సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంది.  

ఈ వివాహ వేడుక పూర్తికాగానే అధికారులు ఆయా జంటలకు వివాహ ధ్రువపత్రం అందజేశారు. దాంతోపాటు వధువుకు ఆభరణాలు, బెడ్‌, వంటగది సామగ్రి, టీవీ, ఫ్రిజ్‌, కూలర్‌ తదితర గృహోపకరణాలు కానుకగా ఇచ్చారు. ఈ జంటలకు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌, మంత్రి ప్రమోద్‌ జైన్‌ భయా శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని