Microplastics: రక్తంలోనూ మైక్రోప్లాస్టిక్‌ జాడలు..!

పర్యావరణంలో ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు మానవ రక్తంలోనూ చేరిపోతున్నట్లు నెదర్లాండ్‌ శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు.

Updated : 26 Mar 2022 04:29 IST

తొలిసారిగా గుర్తించిన నెదర్లాండ్‌ శాస్త్రవేత్తలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోన్న ప్లాస్టిక్‌ వ్యర్థ్యాలు మానవాళికి పెను ముప్పుగా మారుతోన్న సంగతి తెలిసిందే. హిమాలయాలు మొదలు మహాసముద్రాల్లోనూ పెరిగిపోతోన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు మానవ ఆరోగ్యంపై తీవ్ర దుష్ర్పభావాలు కలిగించనున్నాయని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇలా ఇప్పటికే పర్యావరణంలో ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు మానవ రక్తంలోనూ చేరిపోతున్నట్లు నెదర్లాండ్‌ శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. పరిశోధన జరిపిన 80శాతం మంది రక్త నమూనాల్లో మైక్రోప్లాస్టిక్‌ కణాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఇలా రక్తంలో కలిసే ప్లాస్టిక్‌ కణాలు మానవ శరీరం మొత్తం ప్రయాణిస్తూ వివిధ అవయవాల్లో తిష్ట వేసే ప్రమాదమూ ఉందని హెచ్చరిస్తున్నారు.

తక్కువ స్థాయిలోనే అయినా..

అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన ప్లాస్టిక్‌.. ఆహారం, నీరు, శ్వాసక్రియ ద్వారా శరీరంలోకి చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా రోజూవారీగా వినియోగించే వాటర్‌ బాటిళ్లు, ఆహార ప్యాకింగ్‌లో వాడే ప్లాస్టిక్‌, ప్లాస్టిక్‌ కప్పులతో స్వల్ప పరిమాణంలో ఉన్న మైక్రోప్లాస్టిక్‌ (ఒక అంగుళంలో 0.2కంటే తక్కువ వ్యాసం కలిగిన) శరీరంలోనే తేలికగా చేరుతుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి కణాలు రక్తంలో ఏమేరకు చేరుతున్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు 22 మంది ఆరోగ్యకరమైన దాతల రక్తనమూనాలను పరీక్షించారు. వారిలో 17 మంది రక్తంలో ప్లాస్టిక్‌ కణాలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా బాటిళ్లను తయారు చేసేందుకు వాడే పీఈటీ (Polyethylene Terephthalate) ప్లాస్టిక్‌ సగానికిపైగా ఉండగా.. ఆహార పదార్థాల ప్యాకింగ్‌లో వినియోగించే పాలిస్టిరీన్‌ స్థాయిలు 36శాతంగా ఉన్నట్లు కనుగొన్నారు. అయితే, ప్రతిమిల్లీ లీటర్‌ రక్తంలో 1.6 మైక్రోగ్రాముల కంటే తక్కువ స్థాయిలోనే ఉన్నప్పటికీ ఇవి కూడా ఆందోళన కలిగించే విషయమేనని శాస్త్రవేత్తలు గుర్తుచేశారు.

బ్రేక్‌త్రూ ఫలితం..

‘ప్రత్యేకమైన రసాయన పదార్థాలతో కూడిన పాలిమర్లు రక్తంలో ఉన్నాయన్న విషయం తాజా పరిశోధనలో వెల్లడైంది. ఇది అత్యంత ముఖ్యమైన ఫలితం’ అని నెదర్లాండ్‌లోని వ్రిజే యూనివర్సిటీ ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన ప్రొఫెసర్‌ డిక్‌ వెతాక్‌ పేర్కొన్నారు. అయితే, ఈ పాలిమర్స్‌ను విశ్లేషించేందుకు నమూనాల సంఖ్య మరింత పెంచి విస్తృత పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఆ దిశగా అధ్యయనాలు కొనసాగుతున్నాయని డిక్‌ వెతాక్‌ చెప్పారు.

మానవ కణాలకు హాని..

రక్తంలో మైక్రోప్లాస్టిక్‌ కణాలు వల్ల మానవ ఆరోగ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపిస్తాయనే విషయంపై ఇప్పటివరకు సమాచారం లేదు. అయినప్పటికీ ఈ మైక్రోప్లాస్టిక్‌లు మానవ కణాలకు హాని కలిగిస్తాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా శిశువులు, చిన్నారులకు ముప్పు ఎక్కువగా ఉందన్నారు. ఇదివరకు వచ్చిన అధ్యయనాల ప్రకారం, మెదడు, పుట్టబోయే బిడ్డల ఆంత్రమూలము, పోషణావయవాల్లో ఈ మైక్రోప్లాస్టిక్‌లను ఇప్పటికే గుర్తించినప్పటికీ రక్తంలో వీటి జాడలు కనుక్కోవడం ఇదే తొలిసారి. ఇప్పటికే వాయు కాలుష్యం వల్ల శరీరంలోకి చేరే కణాల కారణంగా ప్రతిఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తుచేశారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts