Harishrao: పైరవీలకు రావొద్దు.. 2-3 ఏళ్లు పోస్టింగ్‌ ఇచ్చిన చోటే పనిచేయాలి: హరీశ్‌రావు

రాష్ట్రంలో వైద్యుల నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కొత్తగా నియమితులైన వైద్యుల పరిచయ కార్యక్రమంలో 929 మందికి పోస్టింగ్‌ ఉత్తర్వులు అందజేశారు.

Updated : 24 Mar 2023 15:32 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం బలోపేతం కావడమే కాకుండా దేశంలో అగ్రగామిగా నిలిచిందని ఆ శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో ఉన్న శిల్ప కళా వేదికలో కొత్తగా నియమితులైన వైద్యుల పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, కమిషనర్ శ్వేత మహంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొత్తం 929 మంది వైద్యులకు పోస్టింగ్ ఉత్తర్వులు అందజేశారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. వైద్యుల నియామక ప్రక్రియ పారదర్శకంగా సాగిందని తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఇంత మందికి ఒకేసారి ఉత్తర్వులు ఇవ్వడం ఇదే మొదటిసారని చెప్పారు. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. నిరుపేదలకు వైద్య సేవలందించేందుకు ముందుకొచ్చిన వైద్యులకు స్వాగతం పలికారు. సమాజ సేవకు వైద్యులను పంపినందుకు తల్లిదండ్రులు, గురువులకు ధన్యవాదాలు తెలియజేశారు. తల్లి జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మ ఇస్తారని.. ప్రాణం పోసే శక్తి వైద్యులకు మాత్రమే ఉందని హరీశ్‌రావు అన్నారు. కొవిడ్ సమయంలో గిరిజన ప్రాంతాలు, మారుమూల పల్లెల్లో పని చేసిన వారికి వెయిటేజీ కల్పించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన వైద్యులకు పీజీలో కూడా వెయిటేజీ కల్పించామన్నారు. దయచేసి వైద్యులు బదిలీల కోసం పైరవీలకు రావొద్దని, కనీసం రెండు మూడేళ్లు పోస్టింగ్‌ ఇచ్చిన చోటే పనిచేయాలని చెప్పారు. బాగా పనిచేసి పేదలకు సేవలందిస్తే కౌన్సిలింగ్‌లో వెయిటేజీ కల్పిస్తామని‌ హరీశ్ రావు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని