మహబూబ్‌నగర్‌, షాద్‌నగర్‌లో ఆ రైళ్లకు స్టాప్‌ ఏర్పాటు చేయండి: రైల్వే మంత్రికి కిషన్‌రెడ్డి లేఖ

మహబూబ్‌నగర్, షాద్ నగర్ రైల్వే స్టేషన్లలో రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.

Published : 14 May 2023 22:34 IST

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్, షాద్ నగర్ రైల్వే స్టేషన్లలో రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. యశ్వంత్ పూర్- హజరత్ నిజాముద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు కాచిగూడ నుంచి బయలుదేరి కర్నూలు చేరుకునే వరకు 200 కిలోమీటర్ల మధ్యలో ఎక్కడా స్టాప్ లేని విషయాన్ని గుర్తుచేస్తూ.. మధ్యలో ఉన్న మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్లో ఈ రైలుకు స్టాప్ ఏర్పాటు చేయాలని కోరారు. తద్వారా దిల్లీ, బెంగుళూరు వంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం ఉండదని వివరించారు. 

దీంతోపాటు చెంగల్ పట్టు - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌కు షాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో స్టాప్ ఏర్పాటు చేసినట్లయితే.. హైదరాబాద్ సబర్బన్ ప్రాంతాల్లోని ప్రజలు ముఖ్యంగా తిమ్మాపూర్, కొత్తూరు, బూర్గుల తదితర ప్రాంతాల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని కిషన్ రెడ్డి ఈ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెల హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా రూ. 1,410 కోట్లతో 85 కిలోమీటర్ల పొడవున సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ మధ్య నిర్మించి, విద్యుద్దీకరించిన డబ్లింగ్ రైల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన విషయాన్ని ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు.

తెలంగాణ రాష్ట్రంలో రైల్వే శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. ఇంతవరకూ అందించిన, అందిస్తున్న అన్ని రకాల సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణలో రైల్వే శాఖల ఆధ్వర్యంలో గణనీయమైన పురోగతి జరుగుతోందన్నారు. ప్రధానిగా నరేంద్రమోదీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణలో రైల్వే మౌలికవసతుల కల్పన వేగవంతంగా జరుగుతోందని లేఖ ద్వారా వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని