ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు

డ్రైవర్‌ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్‌ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు.

Updated : 29 Apr 2024 08:32 IST

వాహనమిత్ర లబ్ధిదారులకు జగన్‌ సర్కారు టోపీ
గుంతల రోడ్లతో మరమ్మతులకు రూ.1.80 లక్షల అదనపు ఖర్చు
ఈనాడు, అమరావతి

డ్రైవర్‌ అన్నలు... నా మిత్రులు అన్నారు
ఎప్పటికీ అండగా ఉంటామన్నారు...
జగన్‌ మాటకు చేతకు పొంతన ఉండదుగా...
ఏదో మొక్కుబడిగా సాయం చేశారు...
ప్రతిగా ముక్కుపిండి వసూలు చేశారు...
అదే మోసం ఐదేళ్లుగా చేస్తూనే ఉన్నారు!
దాన్నే గొప్పగా చెబుతూ బాకాలూదుతున్నారు!

వాహనమిత్ర కింద జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని కొందరు డ్రైవర్లకు వాహనమిత్ర కింద ఏడాదికి రూ.10 వేల చొప్పున అయిదేళ్లలో రూ.50 వేలు ఇచ్చింది. దీనికి ప్రతిగా ప్రభుత్వం వారి నుంచి ఏడురెట్ల డబ్బులను వసూలు చేసింది. ‘‘ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మంచి చేయాలని ఆలోచించిన ప్రభుత్వాలు దేశంలో ఎక్కడా లేవు. మన రాష్ట్రంలోనే వారికి ఆర్థిక సాయం అందిస్తున్నాం’’ అంటూ గతంలో వాహనమిత్ర సాయం అందించే సమయంలో సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. వీటిని వింటే జగన్‌ది ఎంత మంచి మనసో అనుకుంటారు. కానీ, ఆయన అసలు నైజం తెలిస్తే... డ్రైవర్లను ఇంతలా మోసం చేస్తున్నారా? అని ముక్కున వేలేసుకోవాల్సి వస్తుంది. మొత్తానికి వైకాపా ప్రభుత్వం... నిత్యం ఆటో నడిపితేగానీ కుటుంబాలను పోషించుకోలేని డ్రైవర్లను కూడా విడిచి పెట్టలేదు.

అనర్హుల పేరిట వడపోత

సొంత ఆటో, ట్యాక్సీ నడిపే వారికి వాహనాల ఇన్సూరెన్స్‌, ఫిట్‌నెస్‌, రిపేర్లు తదితరాలకు ఏటా రూ.10 వేల చొప్పున వాహనమిత్ర సాయం అందిస్తానని జగన్‌ గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌లు 7.5 లక్షల వరకు ఉండగా... వైకాపా ప్రభుత్వం ఏటా సగటున 2.60 లక్షల మందికే సాయం అందించింది. సొంత ఆటో/ట్యాక్సీ కలిగి ఉండి, దాన్ని నడిపే వారికే అనే నిబంధన కారణంగా... మూడింట ఒక వంతు వాహనాల డ్రైవర్లకే సాయం దక్కింది.   రాష్ట్రంలో చాలామంది డ్రైవర్లు నిత్యం ఆటోలను అద్దెకు తీసుకొని నడుపుతుంటారు. ఇలాంటి  వారికి సాయం అందలేదు. పైగా... విద్యుత్‌  వినియోగం నెలకు సగటున  300 యూనిట్లు దాటకూడదని, మూడెకరాల్లోపు మాగాణి, పదెకరాల్లోనే మెట్ట భూమి ఉండాలని, మున్సిపాలిటీ పరిధిలో వెయ్యి చదరపు అడుగులకు మించిన స్థలంలో నిర్మాణం ఉండకూడదని, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, పింఛనుదారు ఉండకూడదనే.. షరతుల కారణంగా లక్షల మంది డ్రైవర్లకు పథకం వర్తించలేదు.

డీజిల్‌ భారమే అత్యధికం

పొరుగు రాష్ట్రాల్లో డీజిల్‌ ధర మనకంటే చాలా తక్కువ. కర్ణాటకలో లీటర్‌పై రూ.11, తమిళనాడులో రూ.5, ఒడిశాలో రూ.3.50 తక్కువగా ఉంది. కర్ణాటక ధరను పరిగణనలోకి తీసుకుంటే... ఆటో డ్రైవర్‌ ప్రతి లీటర్‌పై ప్రభుత్వానికి అదనంగా రూ.11 చెల్లిస్తున్నారు. ఒక డ్రైవర్‌ రోజుకు సగటున 10 లీటర్ల డీజిల్‌ వినియోగిస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నిత్యం రూ.110, నెలకు రూ.3,300, ఏడాదికి సుమారు రూ.40 వేల చొప్పున అయిదేళ్లకు రూ.2 లక్షల మేర జగన్‌ ప్రభుత్వానికి కప్పం కట్టారు.

ఆటోల మరమ్మతులకే రూ.1.80 లక్షలు

జగన్‌ అయిదేళ్ల పాలనలో రోడ్లు అత్యంత అధ్వానంగా తయారయ్యాయి. ముఖ్యంగా గ్రామాలకు వెళ్లే రోడ్ల గురించి ఎంత తక్కువ చెబితే, అంత మంచిది. ఇటువంటి వాటిపై ఆటోలు నడుపుతుంటే... తరచూ పాడవుతున్నాయి. ఆటోల వెనుక చక్రాల బేరింగ్స్‌ దెబ్బతింటున్నాయి. మూడేళ్లపాటు మన్నాల్సిన క్లచ్‌పేట్లు ఏడాదికే పాడవుతున్నాయి. గుంతల్లో పడి టైర్లు త్వరగా దెబ్బతినడంతో 40 వేల కి.మీ.   రావాల్సిన టైర్ల జీవితకాలం.. 30 వేల కి.మీ.కు తగ్గిపోయింది. టైర్లకు తరచూ పంక్చర్లు పడుతున్నాయి. గతంలో లీటర్‌కు 30 కి.మీ. వరకు వచ్చే మైలేజ్‌ ఇప్పుడు 20-25 కి.మీ. వస్తోంది. గతంలో ఆటోల నిర్వహణకు నెలకు రూ.వేయి ఖర్చు అయ్యేది. అధ్వాన రోడ్ల కారణంగా నెలకు సగటున రూ.3 వేలు వెచ్చించక తప్పని పరిస్థితి వచ్చిందని డ్రైవర్లు వాపోతున్నారు. అంటే ఏడాదికి రూ.36 వేల చొప్పున, అయిదేళ్లలో రూ.1.80 లక్షలను రిపేర్లకే ధారపోశారు.


విశాఖ మద్దిలపాలెం రోడ్డులో 2023 ఆగస్టు 17న ఓ ఆటో డ్రైవర్‌కు రవాణా శాఖాధికారి వేసిన జరిమానా రూ.19 వేలు. బాబోయ్‌... నా ఆటో అమ్మేసినా అంత సొమ్మురాదని అధికారులను  బాధితుడు వేడుకోగా... ఒకేసారి కాకుండా విడతల వారీగా జరిమానా సొమ్ము చెల్లించడానికి అవకాశమిచ్చారు.


రూ.3 లక్షలు ఎదురు చెల్లింపు

వాహనమిత్ర కింద ఒక్కో డ్రైవర్‌కు ఏడాదికి రూ.10 వేల చొప్పున అయిదేళ్లలో రూ.50 వేలను వైకాపా ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఏపీతో పోలిస్తే... కర్ణాటకలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.11 తక్కువ. అదంతా జగన్‌ ప్రభుత్వం వసూలు చేస్తున్నదే. అలాగే ప్రతి చిన్న పొరపాటుకీ భారీ జరిమానాలతో వైకాపా ప్రభుత్వం విరుచుకుపడింది. ఇలా అధిక డీజిల్‌ ధర, జరిమానాల రూపంలో ఒక్కో డ్రైవర్‌ నుంచి అయిదేళ్లలో సగటున రూ.3.50 లక్షల మేర ప్రభుత్వం నిలువు దోపిడీ చేసింది. అందులో రూ.50 వేలను సాయంగా అందించింది. ఈ లెక్కన ఒక్కో డ్రైవరే ప్రభుత్వానికి అదనంగా రూ.3 లక్షలు ఎదురు చెల్లించినట్లు అయింది.


ప్రతి పొరపాటుకి భారీ జరిమానా

గతంలో ఆటో డ్రైవర్లు చిన్నచిన్న పొరపాట్లు చేసినా, ఏమైనా పత్రాలు లేకున్నా... రవాణా శాఖ అధికారులు, పోలీసులు నామమాత్రపు జరిమానాలు వేసేవారు. అయితే జగన్‌ ప్రభుత్వం భారీ జరిమానాలతో వారిని పిప్పి చేస్తోంది. వాస్తవానికి 2020లో కేంద్రం రవాణా నిబంధనల ఉల్లంఘనలకు జరిమానాలను పెంచింది. వీటిపై ఏ రాష్ట్రమూ సుముఖత వ్యక్తం చేయకున్నా... ఏపీలో అమలుకు సిద్ధమంటూ జగన్‌ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, బీమా లేకుంటే రూ.2-5 వేల చొప్పున, పర్మిట్‌ లేకున్నా, రెన్యువల్‌ చేసుకోకున్నా రూ.10 వేలు, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ లేకుంటే రూ.3-5 వేలు, తనిఖీ సమయంలో లైసెన్స్‌ లేకుంటే రూ.10 వేల చొప్పున జరిమానాలు వేస్తున్నారు. ఓవర్‌లోడ్‌ ఉంటే... ఆటోలో ఎంతమంది అదనంగా ఉన్నారనే దాంతో సంబంధం లేకుండా రూ.10 వేలు జరిమానా వేస్తున్నారు. విజయవాడ, వైజాగ్‌లలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద ఉల్లంఘనలకు పాల్పడితే రూ.300 జరిమానా విధిస్తున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని