KTR: న్యూజిలాండ్‌లో ‘రాజన్న సిరిపట్టు’ ఆవిష్కరణ.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్

‘రాజన్న సిరిపట్టు’ బ్రాండ్‌ను మరింత విస్తృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని 

Published : 19 Sep 2022 01:19 IST

హైదరాబాద్‌: ‘రాజన్న సిరిపట్టు’ బ్రాండ్‌ను మరింత విస్తృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక, టెక్స్‌టైల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. న్యూజిలాండ్‌లో సిరిసిల్ల పట్టుచీర ‘రాజన్న సిరిపట్టు’ బ్రాండ్‌ను ఆ దేశ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్‌ ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జూమ్‌ ద్వారా పాల్గొన్న కేటీఆర్‌.. ‘సిరిసిల్ల పట్టుచీర’ ప్రాముఖ్యతపై వీడియో సందేశం పంపారు. 

సిరిసిల్ల పట్టుచీర ‘రాజన్న సిరిపట్టు’ అంతర్జాతీయ వేదికలపై అనేక మందిని ఆకర్షిస్తోందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాజన్న సిరిపట్టు చీరలను ప్రారంభించిన న్యూజిలాండ్‌ మంత్రి ప్రియాంకకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సిరిసిల్లకు చెందిన నేతన్నల ఉత్పత్తులను ప్రపంచ వేదికలపైనా ఆవిష్కరించడం అత్యంత సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ఆ దేశ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ఆర్ఐ, బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ తదితరులను మంత్రి అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల కారణంగా.. ఒకప్పుడు సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల నేతన్నలు ఇప్పుడు వినూత్నమైన ఉత్పత్తులతో ప్రపంచాన్ని ఆకర్షించే పరిస్థితికి చేరుకున్నారన్నారు. సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్ లాంటి నైపుణ్యం కలిగిన నేతన్నలు, వినూత్న ఉత్పత్తులను తయారు చేయడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే హరిప్రసాద్ లాంటి నేతన్నల నైపుణ్యం వల్ల సిరిసిల్ల కేంద్రంగా బతుకమ్మ చీరలతో పాటు అగ్గిపెట్టెలో ఇమిడే చీర, వివిధ కళాకృతులు, వివిధ పేర్లతో రూపొందించిన వినూత్నమైన చీరలను నేస్తున్నారన్నారు. సిరిసిల్ల రాజన్న సిరిపట్టుకు మంచి భవిష్యత్తు ఉండాలని, అందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని