ఛార్జర్‌ లేదని... ₹15 కోట్ల ఫైన్‌!

యాపిల్ మొబైల్‌ కంపెనీకి బ్రెజిల్‌లో భారీ షాక్‌ తగిలింది. ఛార్జర్‌ లేకుండా మొబైల్‌ను విక్రయిస్తున్నందుకు అక్కడి వినియోగదారుల ఫోరం (ప్రోకాన్‌-ఎస్పీ) సుమారు ₹15 కోట్ల (2 మిలియన్‌ డాలర్లు) జరిమానా...

Updated : 13 May 2022 12:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్ మొబైల్‌ కంపెనీకి బ్రెజిల్‌లో భారీ షాక్‌ తగిలింది. ఛార్జర్‌ లేకుండా మొబైల్‌ను విక్రయిస్తున్నందుకు అక్కడి వినియోగదారుల ఫోరం (ప్రోకాన్‌-ఎస్పీ) సుమారు ₹15 కోట్ల (2 మిలియన్‌ డాలర్లు) జరిమానా విధించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించి ఛార్జర్‌ లేని మొబైల్‌ను విక్రయించినందుకు గానూ ఈ జరిమానా విధిస్తున్నట్లు ఫోరం వెల్లడించింది.

పర్యావరణ హితం పేరుతో ఐఫోన్ 12 సిరీస్‌ మొబైల్స్‌కి పవర్‌ అడాప్టర్‌, హెడ్‌ఫోన్‌లు లేకుంగా కేవలం ఛార్జింగ్ కేబుల్‌ మాత్రమే ఇస్తున్నట్లు యాపిల్‌ అక్టోబర్‌లో ప్రకటించింది. ఐఫోన్‌ 12 మినీ ధర యూఎస్‌లో 729 డాలర్లు కాగా.. బ్రెజిల్‌లో 1200 డాలర్లకు విక్రయిస్తోంది. ఈ క్రమంలో ఫోన్‌కు ఛార్జర్‌, హెడ్‌ సెట్‌ ఇవ్వకపోవడంతో వినియోగదారులు నష్టపోతున్నారని బ్రెజిల్‌ వినియోగదారుల ఫోరం యాపిల్‌కు రెండు మిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. ఛార్జర్‌ ఇవ్వకుండా ఫోన్‌ విక్రయించడం సమంజసం కాదంటూనే, ధర ఎందుకు తగ్గించడం లేదని వినియోగదారుల ఫోరం ప్రశ్నించింది. దీనిపై యాపిల్‌ స్పందించలేదు. 

‘‘చట్టాలు, నియమాలకు లోబడి కంపెనీలు పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలి. దేశంలో వినియోగదారుల చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయనే విషయం యాపిల్ అర్థం చేసుకోవాలి’’ అని ప్రోకాన్‌ ఎస్పీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ ఫెర్నాండో కాపెజ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే, వినియోగదారులు ఎక్కువగా వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ పద్ధతిని అనుసరిస్తున్నారని, ఫోన్‌లకు ఛార్జర్‌ ఇవ్వడం వృథా అనిపిస్తోందని యాపిల్ వీపీ లీసా జాక్సన్ గతంలో‌ అభిప్రాయపడ్డారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని