Updated : 20 Aug 2020 14:50 IST

ఆ గ్రామమంతా మినీ గ్రంథాలయాలే..!

సాధారణంగా ఏ గ్రామంలోనైనా ముఖ్యమైన వీధుల్లో వివిధ దుకాణాలు, క్లినిక్స్‌, టిఫిన్‌ సెంటర్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ కేరళలోని పెరుంకులం గ్రామంలోని జంక్షన్ల వద్ద బుల్లి బుల్లి గ్రంథాలయాలు దర్శనిమిస్తాయి. పుస్తకాలు చదువుకుంటూ.. పుస్తకం తీసుకొని మరో పుస్తకం అందులో పెడుతున్న ప్రజలు కనిపిస్తారు. అందుకే ఈ గ్రామం కేరళలోనే తొలి ‘పుస్తకాల గ్రామం’గా గుర్తింపు పొందింది. అయితే ఈ గ్రామానికి ఆ పేరు ఊరికే రాలేదు. దాని వెనక కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది.

1948 జనవరి 30న మహాత్మగాంధీ హత్యకు గురయ్యారు. దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. అందరూ ఆయన మృతికి సంతాపం తెలిపారు. కానీ అదే సమయంలో పెరుంకులం గ్రామంలోని కొందరు యువకులు గాంధీ మృతికి సంతాపంగా గుర్తిండి పోయేలా ఏదైనా చేయాలనుకున్నారు. గాంధీకి పుస్తక పఠనమంటే ఎంతో ఇష్టం. అందుకే ఓ గ్రంథాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. కృష్ణా పిల్లై అనే యువకుడు మరికొందరు కలిసి వంద పుస్తకాలను సేకరించి పిల్లైకి చెందిన ఇంట్లోనే ఓ గదిని గ్రంథాలయంగా మార్చేశారు. దానికి బాపూజీ స్మారక వయనశాల (బాపూజీ మెమోరియల్‌ లైబ్రరీ) అని పేరుపెట్టారు. మొదట్లో ఈ గ్రంథాలయం బాగానే నడిచింది. పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం, సొంతంగా పుస్తకాలు ముద్రించడం వంటివి జరిగాయి. ఆ తర్వాత నిర్వహణ లోపంతో కొన్నాళ్లు మూతపడి, గ్రంథాలయ గదిని మార్చేసిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఎట్టకేలకు 2016 ఫిబ్రవరిలో ఈ బాపూజీ స్మారక వయనశాల కోసం కొందరు శ్రేయోభిలాషులు ఇచ్చిన విరాళాలతో సొంత భవనం ఏర్పాటైంది. 

2017లో పెరుంకులం గ్రామ ప్రజలు ఈ గ్రంథాలయాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని భావించారు. ఇందుకోసం గ్రామంలోని ముఖ్య జంక్షన్‌లో చిన్న గ్రంథాలయం పెట్టారు. దానికి మంచి స్పందన రావడంతో గ్రామంలోని ప్రతి జంక్షన్‌లో ఓ బుల్లి గ్రంథాలయం ఏర్పాటు చేశారు. అందులో దాదాపు 50 పుస్తకాలు ఉంటాయి. గ్రామంలో ఎవరైనా సరే ఉచితంగానే పుస్తకాలను తీసుకొని అక్కడే కూర్చొని చదువుకోవచ్చు. లేదా ఒక పుస్తకం ఇంటికి తీసుకెళ్లాలంటే మరో పుస్తకాన్ని అక్కడ పెట్టాలి. అలా పుస్తకాలను ఎక్స్‌ఛేంజ్‌ చేసుకుంటూ ఎన్ని పుస్తకాలైనా తీసుకోవచ్చు. పిల్లలకు చదువుపై ఇష్టం కలిగించేలా చిన్నారులకు సంబంధించిన అనేక పుస్తకాలను అందుబాటులో ఉంచారు. దీంతో 2019 జూన్‌లో రాష్ట్రంలోనే తొలి ‘పుస్తకాల గ్రామం’గా పెరుంకులం గుర్తింపు పొందింది. బుల్లి గ్రంథాలయాలకు, బాపూజీ స్మారక వయనశాలకు కేరళ రాష్ట్ర గ్రంథాలయ మండలి నుంచి నిధులు కూడా వస్తున్నాయి. 

నిజానికి పెరుంకులం గ్రామం కంటే ముందు మహారాష్ట్ర సతారా జిల్లాలోని బిలార్‌ గ్రామంలో బుల్లి గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయి. దీంతో భారత్‌లోనే తొలి ‘పుస్తకాల గ్రామం’గా బిలార్‌ నిలిచింది. ఈ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకున్న బాపూజీ స్మారక వయనశాల సిబ్బంది పెరుంకులం గ్రామంలోనూ బుల్లి గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. అలా పెరుంకులం కేరళలో తొలి.. దేశంలో రెండో ‘పుస్తకాల గ్రామం’గా గుర్తింపు పొందింది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని