TTD: గోవిందా... సేవలు మెరుగుపడవా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వితరణ కేంద్రంలో సేవలన్నింటినీ ఒకే చోట అందుబాటులోకి తీసుకొస్తామన్న తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ప్రకటన అమలుకు నోచుకోలేదు

Updated : 10 Jul 2021 17:03 IST

ప్రైవేటుకు అప్పగించినా ప్రసాద విక్రయ కేంద్రాల్లో అదే తీరు

తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వితరణ కేంద్రంలో సేవలన్నింటినీ ఒకే చోట అందుబాటులోకి తీసుకొస్తామన్న తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ప్రకటన అమలుకు నోచుకోలేదు. అధికారుల ప్రకటనలకు.. వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. రూ.కోట్ల వ్యయంతో ప్రైవేటు ఏజెన్సీని నియమించినా సౌకర్యాలు మాత్రం మెరుగుపడలేదని భక్తులు అంటున్నారు. ప్రైవేటు ఏజెన్సీ సేవలు కూడా పాత పద్ధతిలోనే ఉండటం భక్తులను నిరాశ పరుస్తోంది.

గతంలో శ్రీవారి సేవకులు వివిధ బ్యాంకుల్లో ఉచితంగా అందించే సేవలను ఇటీవలె బెంగళూరుకు చెందిన కేవీఎం ఇన్‌ఫోకాం సంస్థకు తితిదే అప్పగించింది. లడ్డూ కవర్లు మొదలు.. అన్ని సేవలు ఒకే కేంద్రంలో అందుబాటులోకి వస్తాయని అధికారులు ప్రకటించినా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. నెలకు రూ. 5 కోట్ల నిర్వహణ వ్యయం చెల్లించి ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడంతో లడ్డూ విక్రయ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందుతాయని భక్తులు ఆశించారు. దర్శన లడ్డూలు, అదనపు లడ్డూలు, వడ, కవర్ల కోసం కౌంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని భావించారు. ప్రైవేటు ఏజెన్సీ బాధ్యతలు తీసుకొని రెండు వారాలు గడుస్తున్నా సేవల తీరు మాత్రం మారలేదని భక్తులు వాపోతున్నారు.

‘‘లడ్డూలు ఒక చోట.. కవర్లు మరో చోట ఇస్తున్నారు. వడ కావాలంటే మేడ మీదకు వెళ్లాలంటున్నారు. ఇలా రకరకాలుగా భక్తుల సౌకర్యార్థం కాకుండా వారికి అనుకూలంగా ఉండేలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి చర్యలు భక్తులకు అసౌకర్యంగా ఉంటున్నాయి. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా ప్రసాదాలన్నీ ఒకే చోట ఇవ్వగలిగితే బాగుంటుంది. అందులోనూ ప్రస్తుత కరోనా సమయంలో అక్కడా.. ఇక్కడా అని కాకుండా ఒకే చోట ప్రసాదాలు విక్రయిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ప్రైవేటుకు అప్పగించినా సేవల్లో ఎలాంటి మార్పులు రాకపోతే తితిదేపై నిర్వహణ భారం పడటం తప్ప ఉపయోగం ఏముంటుంది’’ అని భక్తులు అభిప్రాయపడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని