Smitha Sabharwal: చాకచక్యంగా నన్ను నేను రక్షించుకున్నా: స్మితా సభర్వాల్‌

ఇంట్లోకి డిప్యూటీ తహసీల్దార్‌ చొరబాటు ఘటనపై ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్‌ స్పందించారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. 

Updated : 22 Jan 2023 11:44 IST

హైదరాబాద్‌: తన ఇంట్లోకి డిప్యూటీ తహసీల్దార్‌ చొరబాటు ఘటనపై ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్‌ (Smitha Sabharwal) స్పందించారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. 

‘‘అర్ధరాత్రి బాధాకరమైన అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు. ధైర్యం, చాకచక్యంతో నన్ను నేను రక్షించుకోగలిగాను. ఎంత భద్రత ఉన్నా.. మనల్ని మనం కాపాడుకునేలా ఉండాలి. రాత్రివేళ తలుపులు, తాళాలను స్వయంగా పరిశీలించుకోవాలి. అత్యవసర స్థితిలో డయల్‌ 100కు ఫోన్‌ చేయాలి’’ అని ట్వీట్‌లో స్మితా సభర్వాల్‌ పేర్కొన్నారు. 

స్మితా సభర్వాల్‌ ఇంట్లోకి అర్ధరాత్రి సమయంలో ఓ డిప్యూటీ తహసీల్దార్‌ చొరబడటం తీవ్ర కలకలం రేపింది. ఉద్యోగం విషయం మాట్లాడేందుకు అంటూ ఇంట్లోకి ప్రవేశించిన అతడిని చూసి సదరు అధికారిణి కేకలు వేయడం.. అప్రమత్తమైన భద్రతాసిబ్బంది అతడిని పట్టుకోవడం.. అతడితో పాటు వచ్చిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించడం లాంటి పరిణామాలు వెంటవెంటనే జరిగిపోయాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను పోలీసులు అత్యంత రహస్యంగా ఉంచారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ప్రాంతంలోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

ఏం జరిగిందంటే..

విశ్వసనీయ సమాచారం మేరకు.. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే స్మితా సభర్వాల్‌ ట్వీట్లకు సదరు డిప్యూటీ తహసీల్దార్‌(48) ఒకట్రెండుసార్లు రీట్వీట్లు చేశాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం రాత్రి 11.30 గంటల సమయంలో కారులో నేరుగా ఆమె ఉండే నివాస సముదాయానికి వెళ్లాడు. తన స్నేహితుడైన ఓ హోటల్‌ యజమానిని వెంట తీసుకెళ్లాడు. తాను ఫలానా క్వార్టర్‌కు వెళ్లాలని కాపలా సిబ్బందికి జంకు లేకుండా చెప్పడంతో అనుమానించని వారు లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. స్నేహితుడిని కారులోనే ఉంచి డిప్యూటీ తహసీల్దార్‌ మాత్రం ఆమె ఇంట్లోకి వెళ్లాడు. ముందు ఉన్న స్లైడింగ్‌ డోర్‌ను తెరుచుకొని లోపలికి ప్రవేశించి గది తలుపు తట్టాడు.

డోర్‌ తెరిచిన మహిళా ఐఏఎస్‌కు అంత రాత్రి సమయంలో ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి కనిపించడంతో నివ్వెరపోయారు. తేరుకున్న ఆమె.. ఎవరు నువ్వు..? ఎందుకొచ్చావు..? అని గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. గతంలో మీకు ట్వీట్‌ చేశానంటూ చెప్పిన డిప్యూటీ తహసీల్దార్‌.. తన ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని సమాధానమిచ్చినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె బయటికి వెళ్లాలని గట్టిగా చెబుతూ కేకలు వేసినట్లు సమాచారం. ఈలోపు భద్రతాసిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కారును జప్తు చేసిన పోలీసులు.. డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు అతడి స్నేహితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని