Viveka Murder case: సునీత న్యాయవాది చెప్పిన వివరాలు పరిశీలించాకే నిర్ణయం: సుప్రీంకోర్టు

వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Updated : 28 Jul 2023 16:45 IST

దిల్లీ: వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వివేకా హత్యకేసుకు సంబంధించి మరో నాలుగు పిటిషన్లు వేరే బెంచ్‌ ముందు పెండింగ్‌లో ఉన్నాయని జస్టిస్‌ సి.టి.రవికుమార్‌, జస్టిస్‌ సంజీవ్‌ కుమార్‌ ధర్మాసనం ముందుకు సునీత తరఫు న్యాయవాది తెచ్చారు. సీజేఐ ధర్మాసనం ఆదేశాలు ఉన్నాయని, అందుకు అనుగుణంగా మరో ధర్మాసనం నాలుగు పిటిషన్లపై విచారణ జరుపుతోందని వివరించారు.

దీనిపై శివశంకర్‌రెడ్డి తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. కేసుకు సంబంధించి ఒక్క ముక్క కూడా చెప్పకుండానే అడ్డుకుంటున్నారని అసహనం ప్రదర్శించారు. సంబంధం లేని విషయాలను పిటిషన్‌కు ముడిపెడుతున్నారని.. హత్యకేసును బెయిల్‌ పిటిషన్‌కు ముడిపెట్టడం ఏంటని ఆగ్రహంతో ఊగిపోయారు. శివశంకర్‌రెడ్డి న్యాయవాదికి న్యాయమూర్తి సర్ది చెప్పారు. సునీత తరఫు న్యాయవాది ఏం చెప్పాలనుకుంటున్నారో, కోర్టుకు ఇవ్వాలనుకున్న వివరాలు ఏమిటో పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. వేరే బెంచ్‌ ముందు పెండింగ్‌లో ఉన్న పిటిషన్ల వివరాలు, గతంలో సీజేఐ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాల వివరాలను సునీత తరఫు న్యాయవాది ధర్మాసనానికి అందజేశారు.

పోలవరానికి జగనే శని.. అహంకారంతో ప్రాజెక్టును నాశనం చేశారు: చంద్రబాబు

ఆరు నెలల క్రితం బెయిల్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగించడంతో.. మళ్లీ పిటిషన్‌ దాఖలు చేసినట్టు శివశంకర్‌రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. రిజిస్ట్రీతో సంప్రదించి.. ఆ పిటిషన్లపై వివరాలు, వాటిలో గతంలో ఇచ్చిన ఆదేశాలు, సీజేఐ ఇచ్చిన ఉత్తర్వులు అన్నీ పరిశీలించి సోమవారం బెయిల్‌ పిటిషన్‌ విచారణపై నిర్ణయం తీసుకుంటామని జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ ధర్మాసనం స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని