Telangana Cabinet: ఈనెల 16 నుంచి దళితబంధు అమలు: సీఎం కేసీఆర్‌

వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 57 ఏళ్ల వారికి తక్షణమే పింఛన్‌ ఇవ్వాలని...

Updated : 01 Aug 2021 21:48 IST

హైదరాబాద్‌: వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 57 ఏళ్ల వారికి తక్షణమే పింఛన్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు తగ్గించడంతో రాష్ట్రంలో మరో 6.62 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో మొత్తం పింఛన్ల సంఖ్య 58 లక్షలకు చేరుకుంటుంది. కుటుంబంలో ఒక్కరికే పింఛన్‌ పద్ధతిని కొనసాగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భర్త చనిపోతే భార్యకు.. భార్య చనిపోతే భర్తకు వెంటనే పింఛన్‌ను బదిలీ చేయాలని ఆదేశించారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం అమలు, విధి విధానాలపై మంత్రివర్గం చర్చించింది. దళితబంధు పథకం పూర్వాపరాలను ఈ సందర్భంగా మంత్రులకు సీఎం కేసీఆర్‌ విశదీకరించారు. అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం వివరించారు. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ఈనెల 16 నుంచి హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. పూర్తి స్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

లబ్ధిదారులు కోరుకున్న పథకాలతో నిరంతర ఉపాధి..
వినూత్న పంథాలో.. లబ్ధిదారులు కోరుకున్న పథకాలతో నిరంతర ఉపాధి కల్పించడమే దళితబంధు పథకం లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే స్పష్టంచేశారు. దళితబంధు పథకం కింద లబ్ధిదారులు పది రోజుల్లోనే ప్రతిఫలం పొందేలా యూనిట్లకు రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ కార్పొరేషన్‌ పరిధిలో ఇప్పటికే అమలు చేస్తున్నవాటిలో రెండు, మూడు యూనిట్లను కలిపి ఒక పెద్ద ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతోంది. ఒక యూనిట్‌కు అనుమతిస్తే ఇతరులపై ఆధారపడకుండా మార్కెటింగ్‌ చేసుకునేలా అవసరమైన యంత్రాలు, వాహనాలు సమకూర్చనుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు పెట్టుబడి సహాయం చేయాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు పల్లె, పట్టణ ప్రాంతాలకు తగినట్లు 47 పథకాలు రూపొందించింది. చిన్న, చిన్న యూనిట్లు కాకుండా ఒక యూనిట్‌ను ప్రారంభిస్తే కనిష్ఠంగా పది రోజులు, గరిష్ఠంగా నెల రోజుల్లో మంచి ప్రతిఫలం దక్కేలా సిద్ధం చేయాలని ఇటీవల దళిత సాధికారత అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. దీనిపై ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని