Tollywood Drugs Case: ఈడీ విచారణకు సహకరిస్తాం: ఎక్సైజ్‌ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ పిటిషన్‌పై ఎక్సైజ్‌ శాఖ

Updated : 25 Apr 2022 14:06 IST

హైదరాబాద్‌: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ పిటిషన్‌పై ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్ అహ్మద్ కౌంటర్‌ దాఖలు చేశారు. ‘‘మార్చి 21న ఈడీకి 828 పేజీలతో వివరాలు ఇచ్చాం. కోర్టులకు సమర్పించిన డిజిటల్ సాక్ష్యాల వివరాలు కూడా అందించాం. కెల్విన్ కేసులో సేకరించిన వాట్సాప్‌ స్క్రీన్ షాట్లు ఈడీకి అప్పగించాం. దర్యాప్తు అధికారులు నిందితుల కాల్ డేటా రికార్డులు సేకరించలేదు. కెల్విన్ కేసులో సిట్ సేకరించిన 12 మంది కాల్ డేటా ఈడీకి ఇచ్చాం. 12 మంది విచారణకు సంబంధించిన వీడియో రికార్డింగ్‌లు ఇచ్చాం.

హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించాలన్న ఉద్దేశం లేదు. పాలనాపరమైన కారణాల వల్ల ఈడీకి సమాచారం ఇవ్వడం కొంత ఆలస్యమైంది. హైకోర్టు ఆదేశాల అమలులో కొంత ఆలస్యమైనందున బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాం. ఈడీ విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. కోర్టు ధిక్కరణ కేసు కొట్టేయండి’’ అని సర్ఫరాజ్‌ కోర్టును కోరారు. మరోవైపు తాము దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో వాదనలకు ఈడీ సమయం కోరింది. ఎక్సైజ్‌ శాఖ వివరాలు హైకోర్టు ఆదేశాల మేరకు ఉన్నాయో లేదో పరిశీలించాలని తెలిపింది. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని హైకోర్టు వెల్లడించింది.

డ్రగ్స్‌ కేసులో నిందితుల కాల్‌ డేటా, డిజిటల్‌ రికార్డులు ఇవ్వట్లేదని ఈడీ గతంలో ఆరోపించింది. హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం స్పందించట్లేదని పేర్కొంది. దీనిలో భాగంగా సీఎస్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఈడీ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని