యాప్‌ల సాయంతో నేరస్థుల ఆటకట్టు

నేరస్థులను పట్టుకునేందుకు ఒకప్పుడు పోలీసులకు చాలా సమయం పట్టేది. ప్రస్తుతం పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానంతో గంటల వ్యవధిలోనే నిందితుల ఆటకట్టిస్తున్నారు....

Published : 27 Jan 2021 13:24 IST

గంటల వ్యవధిలో అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

హైదరాబాద్‌: నేరస్థులను పట్టుకునేందుకు ఒకప్పుడు పోలీసులకు చాలా సమయం పట్టేది. రోజుల తరబడి దర్యాప్తు చేసి, ఆధారాలు సేకరించి వారిని అరెస్టు చేసేవారు. ప్రస్తుతం పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానంతో గంటల వ్యవధిలోనే నిందితుల ఆటకట్టిస్తున్నారు. తప్పించుకొని తిరుగుతున్న వారిని గుర్తించడంతోపాటు ఆపదలో ఉన్న మహిళలకు సహాయం చేసేందుకు తెలంగాణ పోలీసులు యాప్‌లను ఉపయోగించి విజయవంతమవుతున్నారు. 

పోలీసులకు చిక్కకుండా నేరస్థులు వేషాలు మారుస్తారు. ఇలాంటి వారిని పట్టుకునేందుకు దర్పణ్‌ యాప్‌ను తీసుకొచ్చారు. ముఖ కవళికల ఆధారంగా నేరస్థులను గుర్తించి మారువేషంలో ఉన్నా పట్టుకోగలుగుతున్నారు. గతేడాది దర్పణ్ యాప్‌ ఉపయోగించి 154 మందిని గుర్తించారు. నేరస్థులతోపాటు తప్పిపోయిన చిన్నారులను గుర్తించేందుకు ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. అనాథాశ్రమాల్లో ఉంటున్న చిన్నారుల ఫొటోలు సేకరించి ఠాణాల్లో ఉన్నవాటితో పోలుస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 33 మంది చిన్నారులను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

నిందితుల గుర్తింపులో వేలి ముద్రలు ఎంతో కీలకం. కొన్నేళ్లక్రితం వరకు ఘటనాస్థలంలో వేలిముద్రలు సేకరించి వాటిని ల్యాబ్‌లో పరిశీలించిన తర్వాత ఓ నిర్ధారణకు వచ్చేవారు. అందుకు చాలా సమయం పడుతుండటంతో పోలీసులు పాపీలాన్‌ అనే సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారు. నేరం జరిగిన ప్రాంతంలో వేలిముద్రలు సేకరించి తమ వద్ద ఉన్న ట్యాప్‌ సాయంతో ఫింగర్‌ప్రింట్‌ బ్యూరోకి పంపిస్తారు. వాటిని అధికారులు క్షణాల్లో పరిశీలించి వివరాలు తెలుపుతున్నారు. ఒకవేళ నేరం చేసింది కొత్తవారైతే ఆ వేలిముద్రలను భద్రపరుస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 14 వేల మందిని పట్టుకున్నారు.

రోడ్డు ప్రమాదాలు ఇటీవల మరింత పెరుగుతున్నాయి. రాత్రి వేళల్లో ప్రమాదాలు చేసి వాహనదారులు ఆగకుండా వెళ్లిపోతున్నారు. ఆ సమయంలో రికార్డయిన సీసీ కెమెరాల దృశ్యాలతో వాహనాన్ని గుర్తించడం కష్టంగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు పోలీసు శాఖ ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. రవాణా శాఖ నుంచి వాహనాల సమాచారాన్ని తీసుకుంటున్న పోలీసులు ఏఎన్‌పీఆర్‌ పరిజ్ఞానం ద్వారా యజమానులను సులభంగా గుర్తిస్తున్నారు. ఈ విధానం ద్వారా ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించేవారికి చలాన్లు పంపిస్తున్నారు.

మహిళల రక్షణకు పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచేందుకు హాక్‌-ఐ అనే అప్లికేషన్‌ను రూపొందించారు. ఇందులో ఐదుగురు కుటుంబసభ్యుల ఫోన్‌ నంబర్లను నమోదు చేసుకునేలా తీర్చిదిద్దారు. అత్యవసర సందర్భాల్లో హాక్‌-ఐ అప్లికేషన్‌లోని ఎస్‌ఓఎస్‌ మీద నొక్కితే బాధితులున్న ప్రదేశానికి పోలీసులు చేరుకుంటున్నారు. కుటుంబసభ్యులకు సైతం సందేశం వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఇంటి యజమానులు, పనివారు, డ్రైవర్‌, ఎలక్ట్రీషియన్‌ ఇలా 31 విభాగాలకు చెందిన వారి వివరాలు నమోదు చేయవచ్చని, హాక్‌-ఐ యాప్‌ను ఉపయోగించాలని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ విజ్ఞప్తి చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి...

పట్టపగలు.. ప్రాణం తీసిన పగలు

దివ్యాంగుల భద్రతకు భరోసానిస్తూ..
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని