
Ramineni Foundation: పలువురు ప్రముఖులకురామినేని ఫౌండేషన్ అవార్డుల ప్రదానం
హైదరాబాద్: విభిన్న రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రముఖులకు డాక్టర్ రామినేని ఫౌండేషన్-యూఎస్‌ఏ ఆధ్వర్యంలో ఏటా అందించే పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం గచ్చిబౌలిలో జరిగింది. ఈ కార్యక్రమానికి సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలుగువారి గొప్పతనంపై గర్వించాల్సిన సమయమిది అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా 2020, 2021 సంవత్సరాలకు సంబంధించి విశిష్ఠ, విశేష పురస్కారాలను ప్రదానం చేశారు. 2021 సంవత్సరానికి సంబంధించి విశిష్ఠ పురస్కారాలను భారత్ బయోటెక్ సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా.కృష్ణ ఎల్ల, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లకు ప్రదానం చేశారు. 2021కి సంబంధించి విశేష పురస్కారాలను ప్రముఖ తెలుగు నటుడు బ్రహ్మానందం, ప్రొఫెసర్ దుర్గా పద్మజ, సినీ జర్నలిస్టు ఎస్.వి. రామారావుకు ప్రదానం చేశారు. ఇక 2020 ఏడాదికి సంబంధించి విశిష్ఠ పురస్కారాన్ని నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజుకు అందించారు. 2020కి సంబంధించి విశేష పురస్కరాలను యాంకర్ సుమ, డాక్టర్ మస్తాన్ యాదవ్, బండ్లమూడి శ్రీనివాస్‌కు అందజేశారు.