Telangana schools reopen: తెలంగాణలో తెరుచుకున్న విద్యాసంస్థలు

తెలంగాణలో నేటి నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు తెరుచుకున్నాయి.  కరోనా నేపథ్యంలో

Updated : 01 Sep 2021 13:36 IST

జూనియర్‌ కళాశాలల్లో ప్రత్యక్ష బోధన మాత్రమే: ఇంటర్‌బోర్డు

హైదరాబాద్: తెలంగాణలో నేటి నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు తెరుచుకున్నాయి.  కరోనా నేపథ్యంలో విద్యార్థులు మాస్కులు ధరించి పాఠశాల, కళాశాలలకు హాజరయ్యారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో పాఠశాలలను శుభ్రం చేసి విద్యార్థుల భౌతిక తరగతులకు హాజరయ్యేలా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురుకులాలు మినహా పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన జరుగుతోంది. జూనియర్‌ కళాశాలల్లో ప్రత్యక్ష బోధన మాత్రమే జరుగుతుందని ఇంటర్‌ బోర్టు ప్రకటించింది.

పాఠశాలలను సందర్శించిన గవర్నర్‌, విద్యాశాఖ మంత్రి

పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వేర్వేరుగా సందర్శించారు. రాజ్‌భవన్‌ పాఠశాలను గవర్నర్‌ సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పాఠశాలలను అధికారులు శుభ్రం చేయించారు. విద్యార్థులు సంతోషంగా, నిర్భయంగా పాఠశాలకు వచ్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు నా అభినందనలు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు కూడా సంతోషంగా ఉన్నారు. పిల్లలకు వ్యాక్సిన్‌ ఇచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి’’ అని గవర్నర్‌ సూచించారు.

పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు పునఃప్రారంభమైన నేపథ్యంలో హైదరాబాద్‌ విజయనగర్‌ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను మంత్రి సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని విద్యార్థులు నిలబెట్టుకోవాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేజీ టూ పీజీ 30-40 శాతం విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారన్నారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, గ్రామాల్లో గ్రామ పంచాయతీ, పట్టణాల్లో మున్సిపాలిటీలు తాగునీరు, టాయిలెట్ల సౌకర్యాలను కల్పిస్తున్నాయని చెప్పారు. జులై నుంచి ఇప్పటి వరకు 1.20లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారన్నారు. రెసిడెన్షియల్‌ మినహాయించి ప్రత్యక్ష బోధన చేయాలని హైకోర్టు సూచించిందని గుర్తు చేశారు. మధ్యాహ్న భోజనం సమయంలో కచ్చితంగా విద్యార్థుల వెన్నంటే ఉండి చేతులు శుభ్రం చేసుకునేలా చూడాలని పాఠశాలల సిబ్బందికి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని