AP News: ఉత్సాహంగా 'గోదారోళ్ల కితకితలు' ఆత్మీయ సమ్మేళనం

మాటల్లో వెటకారం.. మనసు నిండా మమకారం.. ఈ అలంకారాలు వినగానే మదిలో మెదిలేది గోదారోళ్లే. 

Updated : 06 Dec 2021 11:29 IST

రాజమహేంద్రవరం: మాటల్లో వెటకారం.. మనసు నిండా మమకారం.. ఈ అలంకారాలు వినగానే మదిలో మెదిలేది గోదారోళ్లే. ఈ ప్రాంత వాసులు నలుగురు ఒకచోట చేరితే.. అక్కడ నవ్వుల పండగే. అలాంటిది వేల మంది ఒకేచోట ఏకమైతే.. సంతోషాల సునామీనే. తమదైన యాస, సంప్రదాయాల్ని కాపాడుకునేందుకు ఏర్పాటైన 'గోదారోళ్ల కితకితలు' ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ఆత్మీయ సమ్మేళనం సరికొత్త వినోదానికి వేదికైంది.

రాజమహేంద్రవరంలోని బొమ్మూరు జీపీఆర్‌ గ్రౌండ్స్‌లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 5వేల మంది సభ్యులు హాజరై ఆనందాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా గ్రూప్‌ అడ్మిన్‌ ఈవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ గోదావరి జిల్లాల యాస, సంస్కృతి, సంప్రదాయాలు నేటితరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ గ్రూప్‌ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 2లక్షల మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. 

ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా విందు ఏర్పాటు చేశారు. దాదాపు 40 రకాల సంప్రదాయ వంటకాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. రేడియో జాకీ శ్రీనుమామ వ్యాఖ్యానంతో చిన్న చిన్న పొడుపు కథలు, ఆటపాటలతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని