Ap News: తిరుపతి జలమయం.. తిరుమల కనుమదారిలో విరిగిపడిన కొండచరియలు

చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయంలో..

Updated : 19 Nov 2021 17:54 IST

తిరుపతి: చిత్తూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో తిరుపతి నగరం జలమయం అయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రైల్వే అండర్‌ బ్రడ్జ్‌లు వర్షపు నీటితో మునిగిపోయాయి. తిరుపతి నగరంలోని వెస్ట్‌ చర్చి, తూర్పు పోలీస్‌ స్టేషన్‌ వద్దనున్న అండర్‌ బ్రిడ్జ్‌లు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. నగరంలోని కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు చేరింది. రహదారులు జలమయం కావడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.

విరిగిపడిన కొండచరియలు..

భారీ వర్షాలతో తిరుమల కనుమదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. తిరుమల రెండో కనుమదారిలో హరిణి వద్ద రాళ్లు పడ్డాయి. భారీ వర్షంతో పాపవినాశనం రహదారిని తిరుమల తిరుపతి దేవస్థానం మూసేసింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా సిబ్బంది రాళ్లను తొలగిస్తున్నారు.

వైకుంఠ క్యూలైన్లలోని సెల్లార్‌లోకి వరద నీరు..

తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమాడ వీధులు జలమయం అయ్యాయి. కనుమ దారులు, మెట్ల మార్గంలో భారీగా వరద ప్రవహిస్తుంది. భారీ వర్షంతో రెండో కనుమదారి ప్రమాదకరంగా మారింది. మరోవైపు రహదారిపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. హరిణి సమీపంలో రహదారిపై చెట్టు కూలింది. కొండపై నుంచి రహదారిపైకి మట్టి, రాళ్లు కొట్టుకొచ్చాయి. రెండో కనుమదారిలో వాహనాలు నిలిచిపోయాయి. వైకుంఠ క్యూలైన్లలోని సెల్లార్‌లోకి సైతం వరద నీరు చేరింది.

జిల్లాలో విద్యా సంస్థలన్నింటికీ నేడు, రేపు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో గురు, శుక్రవారాల్లో అన్ని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ సెలవు ప్రకటించారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచామనీ.. జిల్లాలో ఎక్కడైనా అవసరమైతే సేవలను వినియోగించుకుంటామన్నారు.

రేణిగుంటలో దిగని విమానాలు

ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయంలో విమానాలు దిగడం లేదు. వాతావరణం అనుకూలించక విమానాలు తిరిగి హైదరాబాద్‌ వెళ్తున్నాయి. రేణిగుంటలో దిగాల్సిన హైదరాబాద్‌-రేణిగుంట ఇండిగో విమానం బెంగళూరుకు మళ్లించారు. అలాగే వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్‌ ఇండియా, స్పైస్‌ జెట్‌ విమానాలు హైదరాబాద్‌కు వెనుదిరిగాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని