Ukraine Crisis: రుమేనియాకు చేరుకున్న ఏపీ విద్యార్థులు.. కాసేపట్లో దిల్లీకి పయనం

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు వేగవంతం చేశాయి. రుమేనియాకు చేరుకున్న తెలుగు...

Updated : 26 Feb 2022 19:56 IST

అమరావతి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు వేగవంతం చేశాయి. రుమేనియాకు చేరుకున్న తెలుగు విద్యార్థులు మరి కాసేపట్లో ప్రత్యేక విమానంలో దిల్లీ బయల్దేరనున్నారు. తల్లిదండ్రులతో వీడియోకాల్‌లో మాట్లాడిన  కృష్ణా జిల్లా కౌతవరానికి చెందిన అనూష ఈ విషయం వెల్లడించారు. తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా హెల్ప్‌ చేస్తున్నాయని వివరించారు. తనతో పాటు మరో 8 మంది విద్యార్థులు విమానంలో భారత్‌కు వస్తున్నట్టు చెప్పారు. ‘‘తెలుగు విద్యార్థులు స్వదేశానికి వచ్చేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులు కోరారు. మాకు ఎంతో ధైర్యం చెప్పారు. ఇప్పటికీ ఉక్రెయిన్‌లో పరిస్థితులు క్లిష్టంగానే ఉన్నాయి. మిగిలిన వారిని కూడా సురక్షితంగా తీసుకురావాలని కోరుతున్నా’’ అని అనూష విజ్ఞప్తి చేశారు. హంగేరిలోని బుడాపెస్ట్‌ నుంచి మరో విమానం దిల్లీకి బయల్దేరింది. ఇందులో ఐదుగురు తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఈ విమానం రేపు ఉదయం దిల్లీకి చేరుకోనుంది. 

ఏ క్షణం ఏం జరుగుతుందో భయంగా ఉంది..

విన్నిస్తియా సిటీలోని అపార్టమెంట్ హాస్టల్‌లో సుమారు 200 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారని చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన వినోద్‌ తెలిపారు. ‘‘ ఇక్కడ ప్రతి ఒక్క ఉక్రేనియన్‌కి తుపాకులు ఇచ్చారు. పోలండ్‌, రుమేనియా బోర్డర్‌కి రానివ్వడం లేదు. బోర్డర్‌ వద్దకు వెళ్లిన కొందరు అక్కడే ఉండిపోయారు. ఎంబసీ అధికారులు ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని చెబుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయంగా ఉంది’’ అని వినోద్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని