Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Published : 26 Nov 2021 20:57 IST

1. అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం కీలక నిర్ణయం

అంతర్జాతీయ విమాన సర్వీసులను  పునఃప్రారంభించే అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి రద్దు చేసిన అంతర్జాతీయ విమాన కమర్షియల్‌ పాసింజర్‌ సర్వీసుల్ని డిసెంబర్‌ 15 నుంచి పునరుద్ధరించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు డీజీసీఏ శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త వేరియంట్‌ కలకలం రేపుతున్న దేశాలకు మాత్రం పరిమితమైన సేవలు కొనసాగించనున్నట్టు పేర్కొంది.

2. రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థది కీలక పాత్ర: సీజేఐ

న్యాయవ్యవస్థ పరిరక్షణలో న్యాయమూర్తులకు న్యాయవాదులు సహకరించాలని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ కోరారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఉద్దేశపూర్వక దాడుల నుంచి న్యాయవ్యవస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులదే అని తెలిపారు. న్యాయవ్యవస్థ అనే కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు సభ్యులని పేర్కొన్నారు.

3. కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోంది: ఎంపీ విజయసాయి

పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైకాపాకు ప్రత్యేక సిద్ధాంతం ఉంది, ఏ కూటమిలో లేదు. పోలవరంపై కేంద్రం వైఖరిని ప్రస్తావించాలని కోరారు. రెవెన్యూ లోటుపై కేంద్రం తీవ్రమైన అన్యాయం చేస్తోంది. రెవెన్యూ లోటుపై పార్లమెంట్‌లో లేవనెత్తాలని సీఎం చెప్పారు’’ అని వెల్లడించారు.

4. ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం.. మరో ఆరింటిలో పోటీ

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ్టితో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. మొత్తం 12 స్థానాల్లో ఆరు తెరాసకు ఏకగ్రీవం కాగా.. మరో ఆరింటిలో పోటీ నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, వరంగల్‌ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్‌లో కవిత, మహబూబ్‌నగర్‌లో కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచికుళ్ల దామోదర్‌రెడ్డి ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

5. కష్టపడి పనిచేసే వారికే టికెట్లు: చంద్రబాబు

రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి ఆత్మగౌరవ సభలు నిర్వహించాలని తెదేపా పొలిట్‌ బ్యూరో నిర్ణయించింది. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఇంకా దూకుడుగా వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. మహిళలపై దుష్ర్పచారం, అసెంబ్లీలో జరిగిన ఘటనలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని తీర్మానించారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికే టికెట్లు ఇస్తామని, షో చేసే వారిని పక్కన పెడతామని చంద్రబాబు తేల్చి చెప్పారు.

6. 25 మంది భాజపాకు టచ్‌లో ఉన్నారు: తరుణ్‌ చుగ్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు దిల్లీలో షాక్‌ తగిలిందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్‌కు 60 మంది అభ్యర్థులు కూడా దొరకరని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, తెరాస నుంచి 25 మంది నేతలు టచ్‌లో ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భాజపా 80 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

7. కొత్త వేరియంట్‌ వేళ.. ఆ తప్పుడు భావన వీడండి..!

దక్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్‌ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ స్పందించింది. టీకా వేయించుకున్నప్పటికీ.. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్ని దేశాలకు సూచించింది. ఈ మేరకు ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ట్వీట్ చేశారు. మహమ్మారి ముగిసిపోయిందని, టీకా పొందిన వారికి పూర్తి రక్షణ లభిస్తుందనే తప్పుడు భావన ప్రజల్లో నెలకొని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

8. టీమ్‌ఇండియా పర్యటనపై సందిగ్ధం.!

దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో.. టీమ్‌ఇండియా పర్యటనపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్‌ (సీఎస్‌ఏ) అధికారులతో చర్చించిన తర్వాతే.. టీమ్‌ఇండియా పర్యటనపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. డిసెంబరు 17 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 26 వరకు టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే.

9. దేశీయ స్టాక్‌ మార్కెట్లకు మరో బ్లాక్‌ ఫ్రైడే!

ఈరోజు స్టాక్‌ మార్కెట్లకు మరో బ్లాక్‌ ఫ్రైడేగా మిగిలిపోయింది. ఐరోపాలో పెరుగుతున్న కరోనా కేసులు, దక్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్‌ మదుపర్లను నిండా ముంచాయి. మార్కెట్లకు ఎరుపు రంగు పులిమాయి. ఉదయం సెన్సెక్స్‌ 58,254.79 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 56,993.89 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 1687.94 పాయింట్ల భారీ నష్టంతో 57,107.15 వద్ద ముగిసింది.

ఈ ‘బ్లాక్‌ ప్రైడే’ వెనుక ఇంత కథ ఉందా..?

10. 5జీ ట్రయల్స్‌లో వొడాఫోన్‌ మరో మైలురాయి

దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా జరుగుతున్న ట్రయల్స్‌లో ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ (వీఐఎల్‌) తాజాగా మరో సరికొత్త రికార్డును నెలకొల్పింది. తాజాగా నిర్వహించిన ట్రయల్స్‌లో 4Gbps వేగాన్ని అందుకున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. భవిష్యత్‌లో అమ్మకానికి ఉంచనున్న 26 గిగాహెర్జ్‌ లేదా మిల్లీ మీటర్‌ స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌పై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ వేగాన్ని అందుకున్నట్లు  వీఐఎల్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ జగబీర్‌ సింగ్‌ తెలిపారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని