Guntur: తెదేపా నేతపై దాడి.. నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

వైకాపా నేతలు వాలంటీర్లకు కానుకలు ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తున్నారని ప్రత్తిపాడు తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి రామాంజనేయులు ఆరోపించారు.

Published : 20 Mar 2024 15:47 IST

గుంటూరు: నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ వద్ద వైకాపా నేతలు హల్‌చల్‌ చేశారు. పోలీసుల సమక్షంలోనే తెదేపా నేతలపై దాడికి యత్నించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా వైకాపా నేతలు వాలంటీర్లకు కానుకలు ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తున్నారని ప్రత్తిపాడు తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి రామాంజనేయులు ఆరోపించారు. మంగళవారం రాత్రి నుంచి వైకాపా నేత బలసాని కిరణ్‌ కుమార్‌ గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో వాలంటీర్లకు డబ్బులు, కానుకలు పంపిణీ చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, పరిశీలనకు అటువైపు వెళ్లగా వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలిపారు. 

కారు అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు తనపై దాడి చేశారని.. ఘటనపై ఫిర్యాదు చేసేందుకు నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు  వెళ్లామన్నారు. వైకాపా కార్యకర్తలు అక్కడికి చేరుకుని పోలీసుల సమక్షంలోనే మరో మారు ఘర్షణకు దిగారని వివరించారు. ఐదేళ్లుగా అధికార దుర్వినియోగం చేసిన వైకాపా నేతలు ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత కూడా అదే సంస్కృతి కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. వైకాపా, తెదేపా కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో నల్లపాడు పోలీస్‌ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అతికష్టం మీద తెదేపా నేత రామాంజనేయులును అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత కూడా వైకాపా శ్రేణులు స్టేషన్ ఆవరణలో హంగామా సృష్టించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని