Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు...

Updated : 02 Feb 2023 17:16 IST

1. మద్యం కుంభకోణం కేసు.. ఈడీ ఛార్జిషీట్‌లో కేజ్రీవాల్‌, కవిత పేర్లు

దిల్లీ మద్యం కుంభకోణం మనీలాండరింగ్‌ కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఛార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం గురించి ప్రస్తావించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కొత్త కంపెనీ వచ్చిందా? ఒక్కసారైనా జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చారా?: నారా లోకేశ్‌

చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ‘యువగళం’ పాదయాత్ర 7వ రోజు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోకి ప్రవేశించింది. తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి లోకేశ్‌ను పూలమాలలతో స్వాగతించారు. పాదయాత్రలో లోకేశ్‌ను కలిసిన న్యాయవాదులు వారి సమస్యలను వివరించారు. తెదేపా అధికారంలోకి రాగానే న్యాయవాదులకు ఇళ్ల పట్టాలు అందజేసే అంశాన్ని మేనిఫెస్టోలో పెడతామని లోకేశ్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 పరీక్ష తేదీ వచ్చేసింది.. దరఖాస్తు చేశారా?

టీఎస్‌పీఎస్సీ(TSPSC) గ్రూప్‌-4 పరీక్ష(Group 4 exam)కు షెడ్యూల్‌ విడుదలైంది. జులై 1న ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్‌ -1; మధ్యాహ్నం 2.30 గంల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. 8,180 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు  గతేడాది డిసెంబర్‌లో గ్రూప్‌- 4 నోటిఫికేషన్‌ ఇవ్వగా.. ఇప్పటికే దాదాపు 9లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. లోకేశ్‌ పాదయాత్ర.. ప్రచారరథం సీజ్‌ చేసిన పోలీసులు 

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కాన్వాయ్‌లోని ప్రచార రథాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరులో లోకేశ్‌ పర్యటిస్తున్నారు. పట్టణంలో పాదయాత్ర కొనసాగుతుండగా ఓ చోట ప్రజలను ఉద్దేశించి ప్రచార రథం పైకి ఎక్కి ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పోలవరం నిర్వాసితులకు నేరుగా నగదు బదిలీ కుదరదు: కేంద్ర జలశక్తిశాఖ స్పష్టత

పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతున్నందున నిర్వాసిత కుటుంబాలకు కేంద్రమే నేరుగా నగదు బదిలీ చేయడం కుదరదని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తేల్చిచెప్పింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి అనుగుణంగా లేదని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. శుభ్‌మన్‌ గిల్ టీమ్‌ఇండియా భవిష్యత్తు: విరాట్‌ కోహ్లీ

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ శతకం బాదిన విషయం తెలిసిందే. దీంతో అతడు తన కెరీర్లో తొలి టీ20 శతకాన్ని నమోదు చేశాడు. ఈ సందర్భంగా పలువురు ఆటగాళ్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అతడిని టీమ్‌ఇండియా భవిష్యత్తుగా పేర్కొన్నాడు. భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ అతడిని విరాట్‌తో పోల్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇరాన్‌ క్షిపణి స్థావరంపై మొస్సాద్‌ సీక్రెట్ ఆపరేషన్‌..!

ఇరాన్‌(Iran)లో ఇస్ఫహాన్‌ నగరంలో అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్న ఓ ఆయుధ కర్మాగార భవనంపై గతవారం ఓ భారీ పేలుడు చోటు చేసుకొంది. అదే రోజు కొన్ని గంటల వ్యవధిలోనే అజర్షహర్‌లోని చమురు కేంద్రంలో భారీ మంటలు చెలరేగాయి. ఈ దాడులు ఎలా జరిగాయి..? ఎవరు చేశారు..? అక్కడేం ఉందనే విషయాలు వెంటనే ఇరాన్‌(Iran) బాహ్య ప్రపంచానికి  వెల్లడించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కొత్త పన్ను విధానంతో లబ్ధిపొందలేని వారు తక్కువే: CBDT ఛైర్మన్‌

కొత్త పన్ను విధానాన్ని (New Tax Regime) తాజా బడ్జెట్‌ (Budget 2023)లో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని ‘కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఛైర్మన్‌ నితిన్‌ గుప్తా అన్నారు. కొత్త స్లాబులు, పన్ను రేట్ల ద్వారా క్రమంగా మినహాయింపులు, రాయితీలను ఎత్తివేయడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. తద్వారా పన్నుల భారాన్ని తగ్గించాలన్న వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారుల డిమాండ్‌ సైతం నెరవేరుతుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఉదారత చాటుకున్న మెగాస్టార్‌ చిరంజీవి.. ఏకంగా రూ.5 లక్షలు ఆర్థికసాయం

తెలుగు సినీ పరిశ్రమలో (Tollywood) ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిస్తే చేతనైనంత సాయం చేసి తన మంచి మనసును చాటుకుంటారు అగ్ర కథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి. ఇప్పటికే పలువురికి చేయూతనందించిన ఆయన తాజాగా మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సీనియర్‌ కెమెరామెన్‌ దేవరాజ్‌కు రూ.5 లక్షలు ఆర్థికసాయం అందించారు. ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. అందుకే ఎఫ్‌పీఓను ఉపసంహరించుకున్నాం: గౌతమ్ అదానీ

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల మలి విడత పబ్లిక్‌ ఆఫర్‌ (Adani Enterprises FPO)ను ఉపసంహరించుకోవడంపై అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani) స్వయంగా వివరణ ఇచ్చారు. స్టాక్‌ మార్కెట్‌లో ఒడుదొడుకులే ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణమని వివరించారు. అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తర్వాత అదానీ గ్రూప్‌ (Adani Group) కంపెనీ షేర్లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు