Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 01 Jan 2022 17:19 IST

1.ముందస్తు ఎన్నికల ప్రచారం నేనూ విన్నా: చంద్రబాబు

నియోజకవర్గంలో పార్టీ నాయకులు పనిచేయకుంటే మార్పు తప్పదని.. పార్టీ ఎవరి కోసం త్యాగాలు చేయదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. పనిచేయని ఇన్‌ఛార్జిలను పక్కన పెట్టేస్తామని హెచ్చరించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో  పాల్గొన్న చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జగన్‌ అడిగిన ఒక్క అవకాశం ప్రజలిచ్చారు.. కానీ, ఇప్పుడు ఆ భ్రమలు తొలగిపోయాయని వ్యాఖ్యానించారు.

2.ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వాయిదా!

తెలుగు సినిమా ప్రేక్షకులే కాదు, యావత్‌ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR Postponed) విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ram charan) కథానాయకులుగా అగ్ర దర్శకుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో క్లిష్ట పరిస్థితులను దాటుకుని జనవరి 7న విడుదలకు సిద్ధమైంది.

Viral Video: మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఓ మహిళ

3.న్యూ ఇయర్‌ వేళ.. రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు

నూతన సంవత్సరం పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిల్లో మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే రూ.172కోట్ల మద్యం అమ్ముడుబోయింది. 1.76లక్షల కేసుల లిక్కర్‌, 1.66లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్లు సంబంధిత శాఖ తెలిపింది. అత్యధికంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.42.26కోట్లు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రూ.24.78కోట్లు, హైదరాబాద్‌లో రూ.23.13కోట్ల విక్రయాలు జరిగాయి.

4.ఎలాన్ మస్క్‌ నోట ‘శ్రీమంతుడు’ డైలాగ్‌..!

టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ న్యూఇయర్‌ వేళ యువతరానికి ఓ సందేశమిచ్చారు. అది మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాలోని డైలాగ్‌లను గుర్తుచేసేలా ఉండడం విశేషం. కృత్రిమ మేధ పరిశోధకుడు లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విద్యార్థులకు కొన్ని సలహాలిచ్చారు. సాటి మానవులకు పనికొచ్చే పనులు మాత్రమే చేయాలని హితవు పలికారు. మనం సమాజం నుంచి ఎంత లబ్ధి పొందుతున్నామో.. అంతకంటే ఎక్కువ తిరిగివ్వాలని సూచించారు.

5.న్యూఇయర్‌ వేళ.. నిమిషానికి 9000 ఫుడ్‌ ఆర్డర్లు

కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ ఈసారి కూడా కొత్త సంవత్సరం వేడుకలు కాస్త కళతప్పాయి. అటు ఒమిక్రాన్‌ భయం.. ఇటు ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో చాలా మంది ఇళ్లకే పరిమితమై నూతన ఏడాదిని ఆహ్వానించారు. అయితే న్యూఇయర్‌ వేళ ఇంటి భోజనానికి కాస్త విరామమిచ్చి.. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్లు పెట్టుకున్నారు. దీంతో ఫుడ్‌ డెలివరీ యాప్‌ల పంట పండింది. శుక్రవారం రాత్రి నుంచే ఫుడ్‌ ఆర్డర్లకు గిరాకీ పెరిగింది.

F3 : వారెవ్వా.. సినిమా వాయిదా పడిందని ఇలా కూడా చెప్పొచ్చా..!

6.రైతులకు ‘పీఎం-కిసాన్‌’ నిధులు విడుదల చేసిన ప్రధాని

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) పథకం కింద దేశ వ్యాప్తంగా 10.9కోట్ల మంది రైతులకు (100మిలియన్‌) 10వ విడత ఆర్థిక సాయంగా రూ.20,900 కోట్లకు పైగా నిధులను విడుదల చేశారు. పీఎం కిసాన్‌ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.6,000 అందిస్తుండగా ఏటా మూడు వాయిదా పద్ధతుల్లో రూ.2వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

7.కొత్త ఏడాది మీ ఆర్థిక తీర్మానాలేంటి? ఇవి ప్రయత్నిస్తున్నారా?

కొత్త సంవ‌త్స‌రం వ‌చ్చేసింది. ఈ ఏడాదిలో ఏం చేయాలి? ఏం చేయ‌కూడ‌దు? అనే దానిపై అంద‌రూ కొన్ని తీర్మానాలు (రిజల్యూషన్స్‌) తీసుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామం చేయడం, డైట్ పాటించ‌డం, కుటుంబంతో స‌మ‌యం గ‌డ‌ప‌డం.. ఇలా ఎవ‌రి వ్య‌క్తిగ‌త జీవ‌నానికి త‌గిన‌ట్లు వారు కొత్త నిర్ణ‌యాలు తీసుకుని కొత్త సంవ‌త్స‌రంతో పాటు మంచి అల‌వాట్ల‌ను కూడా జీవితంలోకి ఆహ్వానిస్తుంటారు. ఇదేవిధంగా ఆర్థికంగానూ కొన్ని నిర్ణ‌యాలు తీసుకోవాలి.

8.కొత్త ఏడాది.. కొంగొత్త పోస్టర్లు..!

కొత్త ఆశలు.. అంచనాలతో సినీ తారలందరూ 2022కు స్వాగతం పలికారు. ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని, అందరికీ విజయాలు చేకూరాలని కోరుకుంటూ పలు చిత్రబృందాలు కొత్తసినిమా పోస్టర్లు, వీడియోలతో నెటిజన్లకు సర్‌ప్రైజ్‌లు అందించింది. అగ్ర, యువ కథానాయకులకు సంబంధించిన కొత్త సినిమాల అప్‌డేట్‌లు, లుక్స్‌తో సినీ ప్రియులు నెట్టింట పండగ చేసుకుంటున్నారు.

New Year: నూతన సంవత్సరం సందర్భంగా.. బిర్లా మందిరానికి పోటెత్తిన భక్తులు..

9.కలిసికట్టుగా పనిచేస్తేనే.. మహమ్మారికి ముగింపు: డబ్ల్యూహెచ్‌ఓ

కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చి మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్న క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్​ జనరల్​ టెడ్రోస్​ అధనామ్​ కీలక వ్యాఖ్యలు చేశారు​. దేశాల మధ్య అసమానతలను తొలగించి కలిసికట్టుగా పనిచేస్తే.. 2022లోనే ఈ మహమ్మారి అంతమవుతుందని అభిప్రాయపడ్డారు. ‘మహమ్మారి నుంచి ఏ దేశమూ బయటపడలేదు. అయితే కొవిడ్‌ కట్టడికి, చికిత్సకు అనేక నూతన సాధనాలు ఉన్నాయి. సుదీర్ఘ కాలం పాటు దేశాల మధ్య అసమానతలు కొనసాగితే.. మనం నియంత్రించలేనంతగా, కనీసం అంచనా వేయలేనంతగా వైరస్​ ప్రమాదకరంగా మారుతుంది’ అని పేర్కొన్నారు.

10.‘బంగార్రాజు’ వచ్చేశాడు.. నాగ్‌, చై అదరగొట్టేశారు..!

‘ఊరుకోవే పుటికీ.. కితకితలెడుతున్నాయ్‌’ అని అంటున్నారు అగ్రకథానాయకుడు కింగ్‌ నాగార్జున. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం నాగార్జున ఆయన తనయుడు నాగచైతన్యతో కలిసి మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ తాజాగా చిత్రబృందం ‘బంగార్రాజు’ టీజర్‌ను విడుదల చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని