Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 10 Jan 2022 17:01 IST

1.కరోనా ఎఫెక్ట్‌.. ఏపీలో నైట్‌ కర్ఫ్యూ

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. రాత్రి కర్ఫ్యూకి సంబంధించిన మార్గదర్శకాలను  రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేయనుంది.

2.ఏపీ ప్రభుత్వాన్ని నేను ఎలాంటి డిమాండు చేయలేదు: ఆర్జీవీ

సినిమా టికెట్‌ ధరల తగ్గింపు వల్ల సినిమా రంగం తీవ్రంగా దెబ్బతింటోందని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నానితో ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పేర్నినానితో చర్చలు సంతృప్తికరంగా ముగిశాయని ఆర్జీవీ అన్నారు. ఐదు ముఖ్యమైన అంశాలపై చర్చించామని, ప్రధానంగా టికెట్ల రేట్ల తగ్గింపును ముందుగా ప్రస్తావించానని చెప్పుకొచ్చారు.

3.సినిమా వాళ్లకు ఏపీ గుర్తుందా?: ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌

సినిమా వాళ్లకు ఆంధ్రప్రదేశ్‌ అసలు గుర్తుందా? అని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి(Prasanna Kumar Reddy) అన్నారు. ఏపీకి సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని హీరోలు, దర్శకులు, నిర్మాతలు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఎంతసేపటికీ హైదరాబాద్‌లో ఉంటూ తెలంగాణలో సినిమాలు తీసుకుంటూ ఏపీ గురించి ఏనాడైనా ఆలోచించారా? అని నిలదీశారు.

AP news : రోడ్డెక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు

4.రైతులవి సినిమాను మించిన కష్టాలు.. వాటిపై ఏనాడైనా చర్చించారా?: పయ్యావుల

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా సమస్యలు తప్ప మరే సమస్యల్లేనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాష్ట్రంలో ఇతరత్రా సమస్యలు ఏమీ లేనట్టగా సినిమా టికెట్ల ధరల గురించి మంత్రులు చర్చించుకుంటున్నారని మండిపడ్డారు. పీఏసీ సమావేశంలో విద్యుత్ కొనుగోళ్లపై చర్చించిన అనంతరం పయ్యావుల మీడియాతో మాట్లాడారు.

5.నర్సాపురం వెళ్తున్నా.. రెండు రోజులు అక్కడే ఉంటాను: రఘురామకృష్ణరాజు

ఫిబ్రవరి 5 వరకు తనపై అనర్హత వేటు వేయించడానికి వైకాపాకు అవకాశం ఇస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. తాను భారీ మెజారిటీతో గెలుస్తాననే నమ్మకం ఉందని.. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెల్లడించారు. తాను గెలిస్తే మాత్రం సీఎం జగన్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13న నర్సాపురం వెళ్తున్నానని.. రెండు రోజులు అక్కడే ఉంటానని తెలిపారు.

6.మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భారీ భద్రత వైఫల్యానికి సంబంధించి దాఖలైన అభ్యర్థనపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ ఘటనపై స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది.

7.మళ్లీ 18,000 మార్క్‌ను అందుకున్న నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు సోమవారం ఆద్యంతం లాభాల్లో పయనించాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. నిఫ్టీ గత ఏడాది నవంబరు 17 తర్వాత తొలిసారి 18,000 మార్క్‌ను టచ్‌ చేసింది.

Odisha: ఆర్టీసీ బస్సును తొండంతో తోసిన ఏనుగు

8.ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు షాక్‌.. ఆ ఛార్జీల పెంపు!

క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు ఐసీఐసీఐ బ్యాంక్‌ షాక్‌ ఇచ్చింది. క్రెడిట్‌ కార్డులకు సంబంధించిన ఛార్జీలను ఆ బ్యాంకు సవరించింది. పెంచిన ఛార్జీలను ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు ఇప్పటికే వినియోగదారులకు ఆ బ్యాంకు సందేశాలు పంపిస్తోంది. ఇకపై క్రెడిట్‌ కార్డు ఉపయోగించి ఏటీఎం కేంద్రాల నుంచి నగదు తీసినా, ఆలస్యంగా బిల్లు మొత్తం చెల్లించినా వినియోగదారులపై భారీగా భారం పడనుంది.

9.మరిన్ని కఠిన ఆంక్షల దిశగా దిల్లీ.. రెస్టారంట్లు మూసివేత..?

దేశ రాజధాని దిల్లీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో వైరస్ వ్యాప్తి కట్టడికి ఇప్పటికే పలు ఆంక్షలు అమలు చేస్తోన్న దిల్లీ సర్కారు.. తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని యోచిస్తోంది. కరోనా పరిస్థితులపై దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) సోమవారం మరోసారి సమావేశమైంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

10.జకోవిచ్‌కు ఊరట.. ఆస్ట్రేలియాపై కేసు గెలిచిన టెన్నిస్ దిగ్గజం

టెన్నిస్‌ ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు నోవాక్‌ జకోవిచ్‌కు ఊరట కలిగింది. ఆస్ట్రేలియా కోర్టు అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. విచారణ అనంతరం అతడిని వెంటనే క్వారంటైన్‌ డిటెన్షన్‌ సెంటర్‌ నుంచి విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే అతడి వీసాను కూడా పునరుద్ధరించాలని తెలిపింది. ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీలో పాల్గొనేందుకు ఈ సెర్బియన్‌ ఆటగాడు గత బుధవారం మెల్‌బోర్న్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని