Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 May 2023 09:10 IST

1. ఐటీ నోటీసులకు స్పందించలేదా.. తనిఖీలు తప్పవు

ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం స్క్రూటినీ (పునః పరిశీలన) కోసం కేసులను ఎలా ఎంపిక చేయాలనే విషయమై మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ ప్రకారం.. ఐటీ నోటీసులకు ప్రతిస్పందించని మదింపుదార్ల (అసెసీ) కేసులను తప్పనిసరిగా తనిఖీ చేయనుంది. పన్ను ఎగవేతకు సంబంధించిన నిర్దిష్ట సమాచారాన్ని, ఏదైనా చట్టబద్ద ఏజెన్సీ, నియంత్రణ అధికారులు అందించినా కూడా ఐటీ విభాగం సదరు కేసులను పరిశీలిస్తుంది.  ఆదాయ వ్యత్యాసాలకు సంబంధించి పన్ను అధికారులు జూన్‌ 30లోగా ఐటీ చట్టంలోని సెక్షన్‌ 143(2) కింద నోటీసు పంపాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆమెను ఎందుకు గేలి చేశారు?

రొలాండ్‌ గారోస్‌లో ప్రేక్షకులు ఉక్రెయిన్‌ క్రీడాకారిణి మార్తా కోస్త్యుక్‌ను గేలి చేశారు. ఆదివారం మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో బెలారస్‌కు చెందిన సబలెంక చేతిలో పరాజయంపాలైన కోస్త్యుక్‌.. మ్యాచ్‌ అనంతరం ఆమెతో కరచాలనం చేయకపోవడమే అందుకు కారణం. ఆమె కనీసం సబలెంక కళ్లలోకి కూడా చూడడానికి ఇష్టపడలేదు. నెట్‌ దగ్గరికి వెళ్లి ఆమెతో చేయి కలపకుండా నేరుగా చైర్‌ అంపైర్‌ దగ్గరకు వెళ్లింది. కొంతకాలంగా రష్యా లేదా బెలారస్‌ ప్రత్యర్థి ఎదురైన ప్రతిసారీ కోస్త్యుక్‌ ఇలాగే చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నియామకాలు లేవు.. అన్నీ రద్దులే!

వైకాపా ప్రభుత్వం గత నాలుగేళ్లలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోగా ఖాళీ పోస్టులను రద్దుచేస్తోంది. పాఠశాల విద్యకు కొత్తగా పోస్టు మంజూరుచేయాలంటే ఖాళీ పోస్టులను విలీనం చేయాలన్న నిబంధన విధిస్తోంది. విద్య కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న సీఎం జగన్‌కు కొత్త పోస్టులు ఇచ్చేందుకు చేతులు రావడం లేదు. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ పేరుతో మిగులుగా తేల్చి.. రద్దుచేస్తున్నారు. ఒక్క పోస్టూ రద్దుకాదని చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ వందల పోస్టులను రద్దుచేసినా నోరు మెదపడం లేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కఠినంగా సివిల్స్‌ ప్రాథమిక పరీక్ష!

దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌-2023 ప్రాథమిక పరీక్ష.. గత కొన్నేళ్ల ప్రశ్నపత్రాలతో పోలిస్తే కఠినంగా ఉందని అభ్యర్థులు, నిపుణులు తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌; ఆంధ్రప్రదేశ్‌లో  విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో ఈ పరీక్ష జరిగింది. ఉదయం జరిగిన జనరల్‌ స్టడీస్‌ పేపర్‌లో దినపత్రికలు కచ్చితంగా చదివితే మాత్రమే జవాబులు రాయగలిగే ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నేడు కక్ష్యలోకి ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహం

తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ మరో రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమైంది. సోమవారం ఉదయం 10.42 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 వాహకనౌక ద్వారా ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఆదివారం ఉదయం 7.12 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 27.30 గంటలపాటు కొనసాగిన తర్వాత షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సిద్ధమా.. రామయ్యా..!

వారం రోజుల కిందట ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం బాలారిష్టాలన్నీ దాదాపు అధిగమించినట్లే. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నేతృత్వంలో పూర్తి స్థాయి మంత్రివర్గం కూడా సేవలకు ఉపక్రమించింది. నేడో రేపో మంత్రులందరికీ శాఖలూ కేటాయిస్తారు. బంపర్‌ మెజార్టీతో కొలువైన సిద్ధరామయ్య సర్కారుకు అసమ్మతి భయం కూడా అంతంత మాత్రమే. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఒకరిద్దరు సీనియర్లు, యువ నేతలు మినహా పార్టీలో అసమ్మతిని చాటింది లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈ పన్నులేంటి బాబోయ్‌!

 నగరంలోని గాంధీనగర్‌లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌కు 2019-20లో ఆస్తిపన్ను రూ.1,656 వచ్చేది. 2021-22లో రూ.1906కు పెంచారు. 2022-23లో రూ.2,192, ప్రస్తుతం 2023-24కు రూ.2,521 చేశారు. తాజాగా రెండేళ్ల వ్యవధిలోనే.. 52 శాతం పెంచేశారు. గత ప్రభుత్వంలో ఐదేళ్ల వ్యవధిలోనూ దీనిలో కనీసం సగం కూడా ఆస్తిపన్ను పెంచింది లేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కుప్పం.. పులివెందుల అయ్యేది ఇలాగేనా?

కుప్పం పురపాలికను అధికార వైకాపా కైవసం చేసుకోవడంతో సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని, పట్టణంలో అభివృద్ధి జరుగుతుందని అంతా ఆశించారు. అదేరోజు ఆయన పురపాలిక పరిధిలో రూ.66 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన వేశారు. ఈ సందర్భంగానే సీఎం మాట్లాడుతూ.. ‘కుప్పాన్ని పులివెందులా చూస్తా’ అని మాట ఇచ్చారు. సీఎం హామీ ఇచ్చి దాదాపు ఎనిమిది నెలలవుతోన్నా.. మంజూరు చేశామని చెబుతోన్న రూ.66 కోట్లలో రూపాయి కూడా విడుదల కాలేదు. ఫలితంగా గుత్తేదారులు పనులు నిలిపేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు

ఎండ వేడికి తాళలేక అన్ని వయస్సుల వారు ఠారెత్తుతున్నారు. చిన్నారులు,  మహిళలు, యువత, గర్భిణులు, బాలింతలు, వృద్ధులే కాదు.. దీర్ఘకాలిక రోగాలకు ఔషధాలు తీసుకునే వారు... అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు. అధిక రక్తపోటుతో పాటు హృద్రోగం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయ సంబంధిత వ్యాధులకు వాడే ఔషధాలు శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి. వాటిని తీసుకుంటే ఎక్కువ సార్లు మూత్రవిసర్జనకు పోతుంటారు. ఫలితంగా శరీరంలోని నీటి శాతం పడిపోతుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పార్లమెంటు కొత్త భవనంపై ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్‌

పార్లమెంటు కొత్త భవన త్రికోణ ఆకృతిని ఒక శవపేటికతో పోల్చుతూ ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్‌ చేసింది. దీనిపై భాజపా మండిపడింది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు ఇలాంటి శవపేటికలోనే ఖననం చేస్తారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆర్జేడీ నేతలపై దేశద్రోహం కేసు పెట్టాలని భాజపా నాయకుడు సుశీల్‌ మోదీ డిమాండ్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఆర్జేడీ ఈ ట్వీట్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని