Hyderabad News: గడ్డి అన్నారం మార్కెట్‌ ఖాళీ చేయాల్సిందే: హైకోర్టు

గడ్డి అన్నారం మార్కెట్‌ను ఈనెల 18నాటికి ఖాళీ చేయాలని వ్యాపారులకు హైకోర్టు స్పష్టం చేసింది. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఆటంకాలు సృష్టించడం దురదృష్టకరమని

Updated : 15 Mar 2022 19:08 IST

హైదరాబాద్‌: గడ్డి అన్నారం మార్కెట్‌ను ఈనెల 18నాటికి ఖాళీ చేయాలని వ్యాపారులకు హైకోర్టు స్పష్టం చేసింది. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఆటంకాలు సృష్టించడం దురదృష్టకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గడ్డి అన్నారం మార్కెట్‌ను బాట సింగారం తాత్కాలిక మార్కెట్‌కు తరలించి.. అక్కడ ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాటసింగారం తాత్కాలిక మార్కెట్‌లో సరైన సదుపాయాలు లేవంటూ వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్లపై కొంతకాలగా విచారణ జరుగుతోంది. వ్యాపారులు ఖాళీ చేసేందుకు వీలుగా నెల రోజులపాటు మార్కెట్‌ తెరవాలని గత నెలలో మార్కెటింగ్‌శాఖను ఆదేశించింది. కోర్టు ఆదేశించినప్పటికీ మార్కెట్‌లోకి వెళ్లనీయడం లేదని మళ్లీ వ్యాపారులు తెలపడంతో హుటాహుటిన మార్కెట్‌ తెరిచారు. అదే సమయంలో మార్కెట్‌లో కూల్చివేతలు చేపట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఇవాళ మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్‌ను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలమేరకు కూల్చివేతలు నిలిపివేసినట్టు ఇవాళ హైకోర్టుకు వివరించారు. విచారణ జరిపిన హైకోర్టు శుక్రవారం నాటికి వ్యాపారులు మార్కెట్‌ ఖాళీ చేసి బాటసింగారం వెళ్లాలని స్పష్టం చేస్తూ విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని