Telangana News: గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన... రంగంలోకి మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. చిన్న కోడూరు

Updated : 15 Jun 2022 17:48 IST

చిన్న కోడూరు: సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. చిన్న కోడూరు మండలం మెట్టు బండల వద్ద కాంగ్రెస్‌ నేతలు, నిర్వాసితులతో గంట పాటు చర్చలు జరిపారు. గౌరవెల్లి భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, కోదండరెడ్డి, కాంగ్రెస్‌ నేతలు ఈ సందర్భంగా మంత్రికి విజ్ఞప్తి చేశారు. నిర్వాసితులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 18 ఏళ్లు నిండిన వారికి ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. నిర్వాసితులపై  పోలీసుల లాఠీఛార్జి సరికాదని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. మేజర్లకు ప్యాకేజీ ఇవ్వాలనే డిమాండ్‌కు మంత్రి హరీశ్‌రావు అంగీకరించలేదని నిర్వాసితులు తెలిపారు. మొదట గ్రామాన్ని ఖాళీ చేస్తే ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆలోచిస్తానని మంత్రి చెప్పారని వివరించారు. తమకు న్యాయం చేయాలంటూ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రతిపక్షాల మాయలో పడొద్దు: మంత్రి హరీశ్‌రావు

హుస్నాబాద్‌ రైతులకు నీళ్లు రావొద్దని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.  కాంగ్రెస్‌, భాజపా రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ‘‘నాడు మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ను అడ్డుకున్నారు. 2013 చట్టం ప్రకారం ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తాం. 3,816 ఎకరాల భూసేకరణ పూర్తయింది, ఇంకా 84 ఎకరాలే మిగిలింది. గౌరవెల్లి నిర్వాసితులకు ఎకరానికి రూ.15లక్షల పరిహారం ఇస్తున్నాం. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి 937 కుటుంబాలను గుర్తించాం. నిర్వాసితులు ప్రతిపక్షాల మాయలో పడొద్దు’’ అని మంత్రి హరీశ్‌రావు వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని