Hyderabad News: నగర వాసులకు మంత్రి కేటీఆర్‌ న్యూ ఇయర్‌ కానుక

హైదరాబాద్‌ వాసుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు మరో ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి రానుంది. ఆదివారం ఉదయం నూతన సంవత్సర కానుకగా కొత్తగూడ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. 

Updated : 31 Dec 2022 20:57 IST

హైదరాబాద్‌: నూతన సంవత్సర కానుకగా ఆదివారం ఉదయం కొత్తగూడ ఫ్లై ఓవర్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. గచ్చిబౌలి ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు రూ.263 కోట్ల వ్యయంతో కొత్తగూడ నుంచి గచ్చిబౌలి వరకు 2,216 మీటర్ల పొడవుతో ఫ్లై ఓవర్‌ నిర్మాణం చేపట్టారు. నగర వాసులకు సిగ్నల్‌ రహిత రవాణా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ఎస్ఆర్డీపీ కింద జీహెచ్‌ఎంసీ ఈ నిర్మాణం చేపట్టింది.

కొత్తగూడ-గచ్చిబౌలి ప్రధాన ఫ్లైఓవర్‌ 2,216 మీటర్ల పొడవు కాగా, అందులో ఎస్‌ఎల్‌ఎన్‌ టెర్మినల్ నుంచి బొటానికల్‌ జంక్షన్‌ వరకు 5లేన్లతో, బొటానికల్‌ జంక్షన్‌ నుంచి కొత్తగూడ జంక్షన్‌ వరకు 6లేన్లు, కొత్తగూడ జంక్షన్‌ నుంచి కొండాపూర్‌ ఆర్టీఏ ఆఫీస్‌ వరకు 3లేన్ల రోడ్డుతో ఈ ఫ్లైఓవర్‌ను పూర్తి చేశారు. మసీదుబండ నుంచి బొటానికల్‌ జంక్షన్‌ ట్రాఫిక్‌ కోసం రెండు లేన్లతో బొటానికల్‌ అప్‌ ర్యాంపు, కొత్తగూడ నుంచి హైటెక్‌ సిటీ వెళ్లేందుకు 383 మీటర్ల పొడవుతో హైటెక్‌ సిటీ వైపు 3లేన్ల డౌన్‌ ర్యాంపును ఏర్పాటు చేశారు. 470 మీటర్ల పొడవుతో 3లేన్లతో అండర్‌ పాస్‌ను హఫీజ్‌పేటకు వెళ్లేందుకు నిర్మించారు. కొత్తగూడ ఫ్లైవర్‌ వల్ల బొటానికల్‌ గార్డెన్‌, కొత్తగూడ, కొండాపూర్‌ జంక్షన్‌ల మధ్య చాలా తక్కువ దూరంలో ఉన్న కూడళ్ల నుంచి సాఫీగా వెళ్లేందుకు వెసులుబాటు ఉంటుంది. దానికి తోడు ప్రస్తుతం ఉన్న గ్రేటర్‌ కారిడార్‌కు ఇరువైపులా వాణిజ్య పరమైన నిర్మాణాలకు ప్రయోజనం కలుగుతుంది. ఈ జంక్షన్‌ల పరిసరాల్లో అనేక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఉండటంతో రద్దీ సమయంలో ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుంది. గచ్చిబౌలి నుంచి మియాపూర్‌ వరకు, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ నుంచి హైటెక్‌ సిటీ వరకు కనెక్టివిటీతో పాటు మియాపూర్‌, హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ పరిసర ప్రాంతాలను కలుపుతుంది.ఫ్లై ఓవర్ వల్ల బొటానికల్ గార్డెన్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్‌లలో వంద శాతం ట్రాఫిక్ సమస్య పరిష్కారంతో పాటు కొండాపూర్ జంక్షన్‌లో 65 శాతం ట్రాఫిక్ సమస్య తీరుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని