TSPSC: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌పై టీఎస్‌పీఎస్సీ వివరణ

జూన్‌ 11న జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని టీఎస్‌పీఎస్సీ వివరణ ఇచ్చింది.

Updated : 28 Sep 2023 16:24 IST

హైదరాబాద్‌: జూన్‌ 11న జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని టీఎస్‌పీఎస్సీ వివరణ ఇచ్చింది. 258 పేపర్లు అదనంగా వచ్చాయన్న ఆరోపణలపై వివరణఇస్తూ గురువారం ప్రకటన జారీ చేసింది.

‘‘పరీక్ష రోజు కలెక్టర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రకటన ఇచ్చాం. 2,33,248 మంది పరీక్ష రాసినట్టు తెలిపాం. పారదర్శకత కోసం అదే విషయం మీడియాకు చెప్పాం. ఓఎంఆర్‌ స్కానింగ్‌లో 2,33,506 మంది పరీక్ష రాశారని తేలింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ 33 జిల్లాల్లో 994 కేంద్రాల్లో నిర్వహించాం. అనేక జిల్లాల్లో లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. లక్షల మంది రాసినప్పుడు అంకెల్లో స్వల్ప మార్పులు సహజమే. స్కానింగ్‌ తర్వాత తుది సంఖ్య ప్రకటించాం. పరీక్ష తర్వాత కొన్ని పేపర్లు కలిపేందుకు ఆస్కారమే లేదు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు లేవు’’ అని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు సబబేనని హైకోర్టు బుధవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గతంలో ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించినపుడు మరింత జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందని, అలా తీసుకున్నట్లు కనిపించలేదంది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) దాఖలు చేసిన అప్పీలును కొట్టివేసింది. పరీక్షను రద్దు చేసి తిరిగి నిబంధనల ప్రకారం నిర్వహించాలన్న సింగిల్‌ జడ్జి నిర్ణయం సమర్థనీయమేనని జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌ల ధర్మాసనం తీర్పు వెలువరించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు