TSRTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. రాయితీపై ‘పల్లెవెలుగు టౌన్‌ బస్‌పాస్‌’లు

ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. పలు జిల్లా కేంద్రాల్లో పల్లెవెలుగు టౌన్‌బస్‌పాస్‌లను రాయితీపై అందించనున్నట్టు ప్రకటించింది. 

Updated : 17 Jul 2023 15:15 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పట్టణ ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికులపై ఆర్ధిక భారం తగ్గించేందుకు TSRTC కొత్తగా  ‘పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్‌’కు శ్రీకారం చుట్టింది. తొలుత కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్‌లను మంగళవారం (జులై 18 నుంచి) అమలు చేయాలని సంస్థ నిర్ణయించినట్టు TSRTC ఎండీ సజ్జనార్‌ తెలిపారు. 

టీఎస్‌ఆర్టీసీ పెద్ద మనసు.. చిన్నారులకు ఉచిత బస్సు సౌకర్యం!

ఈ టౌన్‌ పాస్‌తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్‌నగర్‌లలో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండలలో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమితంగా ప్రయాణించొచ్చు. అయితే, 10 కి.మీ పరిధికి గాను ‘పల్లెవెలుగు టౌన్‌ బస్‌పాస్‌ కోసం నెలకు  ₹800, 5కి.మీల పరిధికి రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.  ఇప్పటికే హైదరాబాద్, వరంగల్‌లో జనరల్ బస్‌పాస్‌ అందుబాటులో ఉంది. ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు  ఆ తరహా పాస్‌లను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని వీటిని ప్రవేశపెడుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో సోమవారం "పల్లె వెలుగు టౌన్‌ బస్‌పాస్‌’ పోస్టర్లను టీఎస్‌ఆర్టీసీ అధికారులతో కలిసి ఎండీ సజ్జనార్‌ ఆవిష్కరించారు. ఈ నెల 18 నుంచి కొత్త టౌన్‌పాస్‌లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. 

‘‘జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్”ను అందుబాటులోకి తెస్తున్నాం. తొలుత కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఈ పాస్‌లను అమలు చేస్తాం. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మరిన్ని ప్రాంతాలకు వీటిని విస్తరిస్తాం. వాస్తవానికి 10 కి.మీల పరిధికి రూ.1200, 5 కి.మీల పరిధికి రూ.800 ధర ఉండగా.. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో రాయితీపై సంస్థ ఈ పాస్‌లను రూ.800, రూ.500ల చొప్పున ధరలను నిర్ణయించింది. కొత్తగా ప్రవేశపెట్టబోయే ఈ పాస్‌ను హైదరాబాద్‌, వరంగల్‌లో మాదిరిగానే ప్రయాణికులు ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని సజ్జనార్‌ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.  ఈ పాస్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం TSRTC కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. పోస్టర్‌ విడుదల కార్యక్రమంలో tsrtc సీవోవో డాక్టర్‌ రవిందర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌, ఈడీలు మునిశేఖర్‌, కృష్ణకాంత్, పురుషోత్తం, వినోద్ కుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని