Hyderabad: జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలు, కార్యాలయాలకు రెండ్రోజులు సెలవులు

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం, శనివారం సెలవు ప్రకటించింది.

Updated : 20 Jul 2023 20:51 IST

హైదరాబాద్‌: భారీ వర్షాల(Heavy Rains) నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధిలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం, శనివారాలు సెలవు ప్రకటించింది. ప్రైవేటు సంస్థలు సైతం సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మికశాఖను సీఎం కేసీఆర్‌(CM KCR) ఆదేశించారు. మరి కొన్ని రోజులు భారీ వర్షాలు(Heavy Rains)కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం, శుక్రవారాల్లో సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గురు, శుక్రవారాల్లో సెలవులు ఇచ్చినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha IndraReddy) ఈరోజు ఉదయం ట్విటర్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. 

ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నగర వాసులు తడిసిముద్దయ్యారు. పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ట్రాఫిక్‌ అంతరాయం కలగడంతో... ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనుల కోసం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వర్షానికి తడుస్తూ వారి వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. మాదాపూర్‌, గచ్చిబౌలిలో రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రాయదుర్గం, కొండాపూర్‌లో వాహనాల రాకపోకలు భారీగా స్తంభించాయి. ట్రాఫిక్‌ జామ్‌పై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని