Jangaon: వల్మిడి రామాలయంలో వైభవంగా విగ్రహాల పునఃప్రతిష్ఠాపన

జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలో పునర్నిర్మించిన రామాలయంలో.. విగ్రహాల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

Updated : 04 Sep 2023 18:15 IST

పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలో పునర్నిర్మించిన రామాలయంలో.. విగ్రహాల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. త్రిదండి చినజీయర్‌ స్వామి మంగళ శాసనములతో శ్రీ సీతారామ లక్ష్మణులు, హనుమంతుల విగ్రహాలను ప్రతిష్ఠాపన చేశారు. అంతకుముందు దేవాలయానికి వచ్చిన త్రిదండి చిన జీయర్ స్వామికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. 

వాల్మీకి పుట్టిన ఊరు 

వాల్మీకి పుట్టిన ఊరు వల్మిడి అని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో.. రూ.25 కోట్లతో వల్మిడి గుట్టపై సీతారాముల దేవాలయాన్ని పునర్నిర్మించినట్లు చెప్పారు. ఆలయానికి మంత్రి దయాకర్‌ రావు పూర్వ వైభవం తీసుకొచ్చారన్నారు. గుండెలనిండా భక్తి భావం కలిగిన నేత సీఎం కేసీఆర్ అని.. అందుకే రాష్ట్రంలో ఆధ్యాత్మికత వెళ్లి విరుస్తుందన్నారు. రాష్ట్రంలో 7 వేలకు పైగా దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వాల్మీకి నడయాడిన నేల ఇది అని, రాముడి పాదాలు ఇక్కడ ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. భద్రాచలం, అయోధ్య తరహా చరిత్ర ఈ ఆలయానికి ఉందని వివరించారు.

అలాగే ‘శివ కవిత్రయం’లో ఒకరైన పాల్కురికి సోమనాథుడి స్మారక స్తూపం, కల్యాణ మండపాన్ని మంత్రులు ప్రారంభించారు. పర్యాటకాభివృద్ధి పనుల్లో భాగంగా ఇక్కడ సుమారు రూ.34 కోట్లతో సోమేశ్వరాలయ అభివృద్ధి పనులు చేపట్టారు. మరోపక్క పర్యాటక వలయంలో భాగంగా రూ.61 కోట్లతో బమ్మెర, వల్మిడి ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తున్నారు. బమ్మెరలో పనులు తుది దశలో ఉన్నాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని