icon icon icon
icon icon icon

కుప్పం.. చంద్రబాబుకు మళ్లీ పట్టం

కుప్పంలో చంద్రబాబు విజయాన్ని ఎలాగూ అడ్డుకోలేం.. కనీసం మెజారిటీ తగ్గించైనా ఆయన ప్రజల ఆదరణ కోల్పోతున్నారని ప్రచారం చేయాలనేది వైకాపా దుష్టవ్యూహం. దాని కోసం ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

Updated : 30 Apr 2024 07:48 IST

ప్రశాంత కుప్పాన్ని దాడులు, దౌర్జన్యాల నిలయంగా చేసిన వైకాపా 
నిత్యం అలజడులతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించే యత్నం
అయినా ప్రజల గుండెల్లో ఇప్పటికీ తెదేపాపై గూడు కట్టుకున్న ఆదరణ 
పచ్చటి పంటలతో కోనసీమను తలపించే ప్రాంతం
ఎప్పట్నుంచో ఇక్కడ విద్యాసంస్థలు, మౌలిక సదుపాయాలు
కుప్పం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

యువతకు ఉద్యోగావకాశాలు పెరగాలన్నా... రోడ్ల లాంటి మౌలిక వసతులు రావాలన్నా మళ్లీ తెదేపా ప్రభుత్వం వస్తే సాధ్యం.

 కుప్పం నియోజకవర్గం గుడుపల్లెలోని ద్రవిడ విశ్వవిద్యాలయం వద్ద ఇద్దరు విద్యార్థుల అభిప్రాయం


ఏపీ, తెలంగాణలోనే కాదు.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లినా కుప్పం నుంచి వచ్చామంటే గౌరవంగా చూస్తారు. మంచీచెడూ అడుగుతారు. అందుకు కారణం చంద్రబాబేనని మాకు తెలియదా?

  గుడుపల్లె చెందిన ఒక వృద్ధుడు


ఒక్కో ఓటుకు ఎంత ఇస్తారో ఇవ్వమనండి. అన్నీ తీసుకుంటాం. లేకుంటే కక్షలు పెరుగుతాయి. మేం ఎవరికి ఓటు వేయాలో వేస్తాం.. ఎవరి రుణం తీర్చుకోవాలో తీర్చుకుంటాం.

 విజలాపురానికి చెందిన మహిళ


 కుప్పం ప్రాంతంలో పండని కూరగాయలు, పండ్లు అంటూ లేవు. వాటిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు విమానాశ్రయం నిర్మించాలని చంద్రబాబు భూములు సేకరించారు. పనులు మొదలయ్యేలోపే అధికారం పోయింది. తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించేందుకు ఇజ్రాయెల్‌ టెక్నాలజీ తెచ్చారు. రైతులకు ఆదాయం పెంచాలని ఆయన పడిన తపన ఓ రైతుగా నేను ఎలా మరిచిపోగలను?

 మఠం శాంతిపురానికి చెందిన ఓ రైతు  


ఎలాగైనా చంద్రబాబును ఓడించాలని, వీలైతే మెజారిటీ అయినా తగ్గించాలని కొన్నేళ్లుగా ఇక్కడ ఎన్నో వ్యూహాలు పన్నుతున్నారు. ఓటుబ్యాంకును చీల్చేందుకు కాసులు ఎర వేస్తున్నారు. వీటన్నింటినీ జనం గమనిస్తూ గుంభనంగా ఉంటున్నారు.

 కుప్పానికి చెందిన ఓ వ్యాపారి


కుప్పంలో చంద్రబాబు విజయాన్ని ఎలాగూ అడ్డుకోలేం.. కనీసం మెజారిటీ తగ్గించైనా ఆయన ప్రజల ఆదరణ కోల్పోతున్నారని ప్రచారం చేయాలనేది వైకాపా దుష్టవ్యూహం. దాని కోసం ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. దొంగ ఓట్లు, ధనబలంతో అయినా తెదేపా కంచుకోటలో పట్టు సాధించాలనే లక్ష్యంతో.. అయిదేళ్లుగా అక్కడ చేయని అరాచకం లేదు. అన్నక్యాంటీన్లను అడ్డుకోవడంతో అరాచకాలకు శ్రీకారం చుట్టారు. దొంగ ఓట్లు, డబ్బు మూటలతో కుప్పం మున్సిపాలిటీని దక్కించుకున్నారు. అయినా ప్రజల్లో తమకున్న ఆదరాభిమానాలే అండగా.. తెదేపా నేతలు ముమ్మరంగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని కుప్పం, రామకుప్పం, గుడిపల్లె మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి పర్యటించారు. పలువురు ఓటర్లను ప్రశ్నించగా... ఎక్కువ శాతం మంది బాబుకు జై కొడుతున్నారు. గతంలో దొంగ ఓట్లు, దౌర్జన్యాలు, దాడుల గురించి తాము వినడం తప్ప చూడలేదని, అలాంటివన్నీ అయిదేళ్లలో కుప్పానికి తెచ్చారని ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అక్కడక్కడా కొందరు బహిరంగంగా మాట్లాడితే వైకాపా నేతలు దాడి చేస్తారనే భయం కనపడింది. చంద్రబాబుపై అభిమానం ఉన్నా.. ఎన్నికల రోజు వరకు మౌనం తప్పదని చెప్పడం గమనార్హం.

కుప్పం నుంచి వచ్చామంటే.. ఎక్కడైనా అదో గౌరవం

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక మూలకు విసిరినట్లు ఉండే కుప్పం.. ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రమే. 1989 నుంచి ఏడుసార్లు చంద్రబాబు ఇక్కడ విజయం సాధించి, కంచుకోటగా మార్చుకున్నారు. ఆయన సీఎం అయ్యాకే నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కుప్పం నుంచి వచ్చామంటే ఎక్కడైనా ఆదరంగా చూస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. చంద్రబాబు నామినేషన్‌ వ్యవహారాల్ని తెదేపా నేతలే చూసుకుంటారు. డిపాజిట్‌ సొమ్ము సైతం నియోజకవర్గంలోని ఓటర్లే ఇచ్చి తమ అభిమానాన్ని చూపిస్తారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఇతర నేతలు ఈ దఫా నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఇక్కడి నుంచి చంద్రబాబు వరుసగా ఎనిమిదోసారి పోటీకి దిగారు. ఎన్నికలు వచ్చాయంటే కుప్పంలో చంద్రబాబు గెలుపుపై కాకుండా.. మెజారిటీపైనే చర్చలు సాగుతాయి. 1999లో 65,687 ఓట్లతో గెలుపొందగా.. 2004లో 59,588, 2009లో 46,066, 2014లో 47,121 ఓట్ల ఆధిక్యంతో సునాయాసంగా తెదేపా జెండా ఎగరవేశారు. 2019లో 30,722 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి వైకాపా పక్షాన ఎమ్మెల్సీ భరత్‌ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో భరత్‌ తండ్రి చంద్రమౌళి పోటీచేసి ఓటమిపాలవ్వగా.. ఈ సారి కుమారుణ్ని ఓడించాలని తెదేపా వర్గాలు ఉవ్విళ్లూరుతున్నాయి.

చంద్రబాబు హయాంలోనే అభివృద్ధి.. సౌకర్యాలు

కుప్పం నియోజకవర్గంలో గురుకులాలు, ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలే కాదు... ఇంజినీరింగ్‌, వైద్య కళాశాలలు కూడా ఏర్పాటయ్యేలా చంద్రబాబు కృషిచేశారు. ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని సైతం ఇక్కడే నెలకొల్పడం విశేషం. ఊరూరికీ తారు రోడ్లు, అంతర్గత సిమెంటు రోడ్లు కొన్నేళ్ల క్రితమే ఇక్కడ వచ్చేశాయి. ఇక్కడ పండని పంటలు లేవు. కోనసీమ తరహాలో కొబ్బరి చెట్లూ కనిపిస్తుంటాయి. రాయలసీమలో కోనసీమ అన్నట్లు కుప్పం నియోజకవర్గంలోని పల్లెలు పచ్చని పంట పొలాలతో కనువిందు చేస్తుంటాయి. ఈ అభివృద్ధి ఏదీ వైకాపా కళ్లకు కనిపించడం లేదని ఓటర్లు చెబుతున్నారు.

తాగునీరిస్తున్నా ఓర్చుకోలేని వైకాపా

నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ శుద్ధజలం ఇవ్వాలని ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా సుజల అనే పథకానికి పదేళ్ల క్రితమే తెదేపా శ్రీకారం చుట్టింది. ఆర్‌ఓ ప్లాంట్ల ద్వారా 20 లీటర్ల లీటిని రూ.2 చొప్పున సరఫరా చేశారు. దాన్నీ వైకాపా ఓర్చుకోలేకపోయింది. 2019లో జగన్‌ సీఎం కావడంతోనే నీటి క్యాన్ల ధరను రూ.5కు పెంచారు. ఎన్టీఆర్‌ బొమ్మ స్థానంలో పెద్దిరెడ్డి, జగన్‌ బొమ్మలు వేశారు. అందుకు అయిన ఖర్చునూ పంచాయతీల నుంచి రాబట్టారు. కొద్ది నెలలకే పూర్తిగా పంపిణీని నిలిపివేశారు. ఫలితంగా ఊరూరా నిర్మించిన ట్యాంకులు, ప్లాంట్లు వృథాగా ఉన్నాయి. ప్రజలు ప్రైవేటు వ్యాపారుల నుంచి నీళ్లు కొంటున్నారు.

అయిదేళ్లలో ఒరగబెట్టిందేమీ లేదు

కుప్పం పట్టణాన్ని పురపాలక సంఘంగా మార్చామని గొప్పలు చెప్పే వైకాపా.. ఇంటి పన్ను, ఇతర పన్నులతో ప్రజల నడ్డి విరిచింది. రెవెన్యూ, పోలీసు డివిజన్లు తప్పితే కొత్తగా కల్పించిన సౌకర్యాలు ఒక్కటీ లేవనే అసంతృప్తి స్థానికుల నుంచి వినిపించింది. హంద్రీ నీవా కాలువ ద్వారా కుప్పానికి సాగునీరు ఇచ్చామంటూ ప్రచారం చేసుకోవాలన్న సీఎం జగన్‌ ఎత్తుగడ వికటించి చివరకు ఆయనే నవ్వుల పాలయ్యారు. 2019 నాటికే 87% కాలువ పనులు పూర్తయ్యాయి. కొద్దిపాటి పనులు పూర్తిచేసి.. నీళ్లు నిలిపి గేట్లెత్తారు. రెండోరోజే ఆ గేట్లు పీకేసి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం సిగ్గుపడాల్సిన విషయమని కొందరు పేర్కొన్నారు.

ప్రశాంత కుప్పంలో.. గొడవలు, కేసులే

ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గాన్ని అయిదేళ్లుగా నిత్యం గొడవలు... లాఠీఛార్జీలు... కేసులతో అట్టుడికిపోయేలా చేసిన పాపం వైకాపాదే. చంద్రబాబును సైతం కుప్పంలో అడుగుపెట్టకుండా అలజడి సృష్టిస్తున్నారు. 2022 ఆగస్టులో చంద్రబాబు పర్యటనకు ముందు వైకాపా జెండాలు పెట్టారు. వాటిని తొలగిస్తున్నారంటూ తెదేపా శ్రేణులపై రాళ్లదాడి చేయడమే కాకుండా 40 మంది తెదేపా నేతలపై కేసులు పెట్టారు. 2023 జనవరిలో శాంతిపురం మండలం జేబీ కొత్తూరు వద్ద చంద్రబాబు పర్యటనను సాగనీయకుండా పోలీసులు అడ్డుకుని చుట్టుముట్టారు. విధి నిర్వహణను అడ్డుకున్నారని, పోలీసు వాహనాలను ధ్వంసం చేశారని 60 మందిపై కేసులు పెట్టారు. తర్వాత రోజే అన్నక్యాంటీన్‌ను ధ్వంసం చేశారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు సహా పలువురిపై అక్రమ కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా లెక్కలేనన్ని. చివరకు 11 మంది నేతలపై రౌడీషీట్లు తెరిచారు.

చంద్రబాబును ఓడించేందుకు డబ్బు సంచులు

కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లకు రూ.5వేలు ఇవ్వడమే కాకుండా.. దొంగ ఓట్లు వేయించారు. ఈ దఫా మళ్లీ దొంగ ఓట్లు, రూ.కోట్లు వెదజల్లాలనే ప్రయత్నం చేస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకత్వంలో వైకాపా అభ్యర్థి భరత్‌ వ్యూహాలను అమలు చేస్తున్నారు. కొందరు తెదేపా నేతలు, కార్యకర్తలకు రాయ‘బేరాలు’ పంపుతున్నారు. డబ్బుకు లొంగకుంటే దౌర్జన్యాలు, దాడులకు పాల్పడేందుకూ వెనకాడని పరిస్థితి కనిపిస్తోందని తెదేపా నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్‌, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, పార్టీ విస్తరణ విభాగం కన్వీనర్‌ డాక్టర్‌ బీఆర్‌ సురేష్‌బాబు ప్రచార బాధ్యతలు చూస్తున్నారు. భువనేశ్వరి సైతం నియోజకవర్గంపై దృష్టి సారించారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక మ్యానిఫెస్టోను రూపొందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img