Minister Botsa: రైలు ప్రమాద మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: బొత్స

విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Published : 30 Oct 2023 14:14 IST

విజయనగరం: విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జిల్లా సర్వజన ఆస్పత్రిలో క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కంటకాపల్లిలో జరిగిన రైలు ప్రమాద ఘటన దురదృష్టకరమని చెప్పారు. సంఘటన ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగితే 7.30 గంటలకే మేము అక్కడికి చేరుకోవడం జరిగిందన్నారు. 

ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో 29 మంది కి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించడం జరిగిందని పేర్కొన్నారు. ‘‘ప్రమాదంలో 13 మంది చనిపోయారు. అందులో ఒకరు రైల్వే ఉద్యోగికావడం వల్ల.. ఆయన మృతదేహం రైల్వేశాఖ స్వాధీనంలో ఉంది. మిగతా 12 మృతదేహాలను సర్వజన ఆస్పత్రికి తీసుకొచ్చాం. వాటిలో ఆరు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ఆయా మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తాం. ఘటనపై సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఆయన సూచన మేరకు మృతుల కుటుంబాలకు ₹10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి ₹2 లక్షలు, చిన్న చిన్న గాయాలు తగిలిన వారికి ₹50 వేలు చొప్పున పరిహారం ప్రకటించాం’’ అని బొత్స వెల్లడించారు. మంత్రి బొత్స వెంట డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు