Edible oil: వంటనూనె ధరల మంట ఎందుకు?
కలాయిలో నూనె చుక్క పడనిదే రోజు గడవదు. అలాంటి వంటనూనెల ధరలు సామాన్యుడికి గుది బండగా మారుతున్నాయ్. నూనె ధరలు భారత్‌లో గత ఏడాది కాలంలో దాదాపు 40 శాతానికిపైగా పెరిగాయంటే అతిశయోక్తి కాదు. కొన్ని ప్రాంతాలు, ..
కలాయిలో నూనె చుక్క పడనిదే రోజు గడవదు. అలాంటి వంటనూనెల ధరలు సామాన్యుడికి గుది బండగా మారుతున్నాయ్. నూనె ధరలు భారత్‌లో గతేడాది కాలంలో దాదాపు 40 శాతానికిపైగా పెరిగాయంటే అతిశయోక్తి కాదు. కొన్ని ప్రాంతాలు, నూనెల్లో రకాల కారణంగా ధరల్లో చిన్నపాటి వ్యత్యాసాలున్నప్పటికీ అన్ని రకాల వంట నూనె ధరలు పెరిగాయి. అసలు వంటనూనెల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? వీటిని నియంత్రించడం సాధ్యమేనా?
నూనె ధరల్లో హెచ్చుతగ్గులనేవి వివిధ రకాల అంశాలపై ఆధారపడి ఉంటాయి. దేశీయంగా ఉత్పత్తి తగ్గిపోవడం, ఎక్కువగా దిగుమతిపైనే ఆధారపడటం, ప్రభుత్వం విధించే సుంకాలు.. ఇలా అన్నీ నూనె ధరలు పెరిగేందుకు కారణాలే. దేశ అవసరాల కోసం దాదాపు 70 శాతం వంట నూనెలను భారత్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. పదేళ్ల ముందు వరకు మన అవసరాలకు సరిపడా నూనెలు ఇక్కడే లభించేవి. కానీ, అంతర్జాతీయ స్వేచ్ఛా వాణిజ్యానికి అనుగుణంగా ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకొచ్చారు. అందువల్ల విదేశీ ఉత్పత్తులను దేశంలోని ఆహ్వానించక తప్పలేదు. అంతేకాకుండా తలసరి వినియోగంలోనూ పెరుగుదల రావడంతో నూనెల ధరలకు రెక్కలు వచ్చాయి.
అప్పట్లో ఆవ నూనే..!
1990 ప్రాంతంలో భారత్‌లో ఎక్కువ మంది ఆవ నూనెకే మొగ్గు చూపేవారు. అది దేశీయంగా ఉత్పత్తి కావడం వల్ల అందుబాటు ధరలో లభించేది. కానీ ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనెలనే వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకున్న వాటిల్లో వంటనూనెలతో పాటు ముడి చమురు, బంగారానికే అధికంగా ఖర్చు చేస్తోందంటే.. వంటనూనెల కోసం ఎంత మొత్తంలో చెల్లిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా విదేశాలపై ఆధారపడుతున్న నేపథ్యంలో ఆయా దేశాల నిబంధనల్లో ఏ చిన్న మార్పులు సంభవించినా.. దాని ప్రభావం భారత్‌లోని వంట నూనెల ధరలు ప్రభావితం అవుతున్నాయి. ఉదాహరణకు పామాయిల్ సేద్యంలో అగ్రగామిగా ఉన్న మలేసియాలో లాక్‌డౌన్ కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఫలితంగా అక్కడ దిగుబడి తగ్గిపోయి.. కొరత ఏర్పడింది. దాని ప్రభావం అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై అనివార్యమైంది. మరోవైపు ఉక్రెయిన్, రష్యాలోనూ సన్‌ఫ్లవర్ పంటలు దెబ్బతిన్నాయి. దాని ప్రభావం కూడా భారత్‌లో వంటనూనెల ధరలను ప్రభావితం చేసింది.
లాక్‌డౌన్ ప్రభావం
గతంలో ఆహార ధాన్యాలతోటు నూనె గింజలను విధిగా పండించే వారు. కానీ, ఇటీవల కాలంలో వేరుసెనగ, సన్‌ఫ్లవర్, పామాయిల్ పండించే రైతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. సరిగా దిగుబడి రాకపోడం, గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో తమ అవసరాల మేరకు తక్కువ స్థలంలోనే పండించుకుంటున్నారు. గతంతో పోల్చుకుంటే వినియోగం అధికమైంది. మరోవైపు లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా మంది ఇళ్లకే పరిమితమై, ఇంట్లో వంట చేసుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో నూనె అవసరం ఎక్కువగా ఏర్పడింది. ఓ వైపు వినియోగం పెరగడం.. మరోవైపు ఉత్పత్తి తగ్గిపోవడంతో వంటనూనె ధరలు అమాంతం పెరిగిపోయాయి.
నియంత్రణ సాధ్యమేనా?
గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో నూనె గింజల ఉత్పత్తి క్రమంగా పెరుగుతోంది. ఆ దిశగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. దీనివల్ల ధరలు అదుపులో ఉండటంతో పాటు ఆహార భద్రత కలుగుతుందని, రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కానీ, దేశీయ ఉత్పత్తి ప్రభావం ధరల నియంత్రణపై కొంతవరకు మాత్రమే ప్రభావం చూపించగలదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే భారత్‌లో ఎక్కువ మంది వరి, గోధుమ పంటలవైపే మొగ్గు చూపుతారు. అంతేకాకుండా అధునాతన వ్యవసాయ విధానాలు మన దేశంలో ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఫలితంగా ఉత్పత్తి తగ్గిపోతోంది. ఉదాహరణకు అత్యాధునిక వ్యవసాయ పద్ధతులు అందుబాటులో ఉన్న బ్రెజిల్.. భారత్ కంటే మూడురెట్లు ఎక్కువగా సోయాబీన్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. దిగుబడి తక్కువగా ఉన్న భారత్.. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం అనివార్యమవుతోంది. అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. వంటనూనెల ధరలు అదుపులో ఉండాలంటే ముఖ్యంగా దేశీయ ఉత్పత్తిని ప్రారంభించి, దిగుమతిని వీలైనంత వరకు తగ్గించుకోవాలి.
దిగుమతి సుంకాల ప్రభావం
వంట నూనెలు పెరగడానికి దిగుమతి సుంకాలు కూడా కారణమవుతున్నాయి. పామాయిల్ దిగుమతిపై భారత్ 32.5 శాతం సుంకాన్ని వసూలు చేస్తోంది. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం దీనిని తగ్గించినట్లయితే నూనెల రిటైల్ ధరలు తగ్గే అవకాశముంది. ఇటీవల ధరలు కొంతమేర తగ్గినప్పటికీ గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ధరలు ఆకాశాన్ని అంటాయనే చెప్పాలి. అటు ప్రభుత్వాలు, ఇటు రైతులు సమన్వయంతో పని చేసినప్పుడే వంట నూనె ధరలు తగ్గేందుకు ఆస్కారముంది.
-ఇంటర్నెట్‌డెస్క్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: మూడో వన్డేలో సూర్యకుమార్‌ని తప్పిస్తారా? రోహిత్ ఏమన్నాడంటే..
-
Movies News
Salman khan: సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు ఈ- మెయిల్.. భద్రత మరింత పెంపు!
-
India News
Parliament: ఇంకెన్నాళ్లీ ప్రతిష్టంభన.. అడ్డంకులు సృష్టించొద్దు: ఓం బిర్లా
-
India News
Delhi Liquor Scam: ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. రేపు మళ్లీ రావాలని చెప్పిన అధికారులు!
-
Sports News
MIW vs DCW: ముగిసిన ముంబయి ఇన్నింగ్స్.. దిల్లీ లక్ష్యం 110
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు